పెళ్లికాని వాళ్లకూ పింఛన్ అందించాలనే నిర్ణయాలను హర్యానా ప్రభుత్వం చేస్తున్నది. నెల రోజుల్లో ఈ పింఛన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుని వెల్లడించనున్నట్టు తెలిసింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు అవివాహితులైన స్త్రీ, పురుషులకు ఈ పింఛన్ అందించే అవకాశం ఉన్నది.వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వాలు పింఛన్ ఇవ్వడం సర్వసాధారణ విషయం. నిరుద్యోగ భృతి డిమాండ్లనూ మనం విన్నాం. కానీ, పెళ్లి కాని వాళ్లకు పింఛన్ ఇవ్వాలనే డిమాండ్ ఎక్కడా వినలేదు. ఆ డిమాండ్ రావడమే కాదు.. ప్రభుత్వమూ అందుకు సుముఖంగా స్పందించి పెళ్లికాని వాళ్లకు పింఛన్ ఇవ్వాలనే ఆలోచనలు చేయడం గమనార్హం.
హర్యానా ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయంపై ఆలోచనలు చేస్తున్నది. నెల రోజుల్లో పెళ్లి కాని వారికి పింఛన్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ పథకం అమలు చేస్తే.. దాని కింద పెళ్లి కాని వారు ప్రయోజనాలు పొందుతారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు గల అవివాహితులు ఈ పథకానికి అర్హులు అని భావిస్తున్నారు.పురుషులతోపాట స్త్రీలకూ ఈ పథకం కింద పింఛన్ ఇచ్చే యోచనలో ఉన్నారు. ఈ విషయాలను సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వెల్లడించడం గమనార్హం. ఓ కార్యక్రమంలో 60 ఏళ్ల అవివాహిత తనకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంది. దీనికి సమాధానం ఇస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ అందుకు అనుగుణంగా పథకం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.హర్యానా వాసి అయి ఉండటంతోపాటు అవివాహితులై ఉండాలి. సంవత్సర ఆదాయం రూ. 1.80 లక్షలకు మించకుండా ఉండాలనే షరతులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం అమల్లోకి వస్తే 1.25 లక్షల మందికి ఈ పింఛను అందుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం వృద్ధాప్య పించన్, వికలాంగులకు పించన్ అందిస్తున్నది.