Devotional

జగన్నాథుడికి రథ నీరాజనం

జగన్నాథుడికి రథ నీరాజనం - Puri Rathayatra And Netrotsavam 2019 Information

జగాలనేలే జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో కలసి అమ్మదగ్గరకు పయనమయ్యే యాత్ర… అలిగిన అమ్మవారిని ఊరడించే యాత్ర… భక్తకోటికి స్వామివారే స్వయంగా ఎదురెళ్లే యాత్ర… ఇలా ఒకటారెండా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు పూరీ జగన్నాథుడి రథయాత్ర (జులై 4). జయజయధ్వానాలు మిన్నంటుతున్న వేళ మైమరపించే మంగళవాద్యాల నడుమ అత్యంత రమణీయంగా ముందుకు సాగుతాయి ఆ జగన్నాథుడి రథచక్రాలు.
**జనసంద్రంగా మారిన పూరీ నగరవీధుల్లో జగన్నాథుడు రథంమీద ఊరేగుతున్న మనోహర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవనడంలో సందేహం లేదు. నిజానికి ఆషాఢ శుద్ధ విదియనాడు జరిగే ఈ యాత్రకు సంబంధించిన సంబరాలు రెండు నెలల ముందే-అంటే వైశాఖ బహుళ విదియనాడే ప్రారంభమవుతాయి. రథాల తయారీకి కావల్సిన కలపను సేకరించడం, శాస్త్రోక్తంగా వాటిని పూరీకి తరలించడం, నగిషీలతో రథాలను తయారుచేయడం… ఇదంతా ఒక పండగలా జరుగుతుంది. రథయాత్రకు పక్షం రోజుల ముందు జ్యేష్ఠ పూర్ణిమ రోజున చతుర్ధామూర్తులను (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. దీన్నే దేవస్నాన యాత్రగా పేర్కొంటారు. దీంతో పురుషోత్తముడు జ్వరానికి గురై, అదే రోజు రాత్రి చీకటి మందిరానికి చేరతాడు. ఇక్కడ 14 రోజుల గోప్య సేవలు, చికిత్సల నేపథ్యంలో భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్ధామూర్తులకు దైతాపతులనే సేవాయత్‌లు సేవలు చేస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధద్రవ్యాలు మిళితం చేసిన కుండలను ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలను వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని ఫుల్లెరి తెల్లొ అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటాడు. ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ఆసనాన్ని తిరిగి అధిరోహించి భక్తులను విప్పారిన కళ్లతో వీక్షిస్తాడని నమ్మకం. అందుకే దీన్ని నేత్రోత్సవం అని అంటారు.
**రథం కదిలె
ఆషాఢ శుద్ధ విదియనాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. గుండిచా మందిరానికి బయలుదేరే ముందు ముగ్గురు మూర్తులకు ఆలయ పొహండి (లోపలి నుంచి వెలుపలకు తేవడం) వేడుక జరుగుతుంది. తర్వాత రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలమీద బంగారు చీపురుతో ఊడ్చి, కస్తూరి కల్లాపి చల్లి, అర్చన చేస్తాడు. ఈ ప్రక్రియను చెరాపహర అంటారు. అనంతరం వరుసక్రమంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథుని రథాలు శ్రీక్షేత్ర ఆవరణ నుంచి గుండిచా మందిరానికి చేరతాయి. పెంచిన తల్లి సన్నిధిలో పురుషోత్తముడు తొమ్మిది రోజులు విడిది చేస్తాడు. ఈ సమయంలో గుండిచా మందిరంలో విభిన్న వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో హీరాపంచమి ముఖ్యమైంది. ఇది ఆలుమగల విరహవేదనకూ, ప్రేమానురాగాలకూ ప్రతీకగా నిలుస్తుంది. రథయాత్రలో తననూ తీసుకెళ్లాలని జగన్నాథుడిని మహాలక్ష్మి కోరుతుంది. అన్నాచెల్లెళ్ల యాత్రకు భార్యను వెంటతీసుకెళ్లడం సాధ్యంకాదని భావించిన పురుషోత్తముడు ఆషాఢ శుద్ధ పంచమి ఉదయానికి శ్రీక్షేత్రం చేరుకుంటానని మాటిస్తాడు. పంచమినాడు స్వామి తిరిగిరాకపోవడంతో మహాలక్ష్మి ఆగ్రహిస్తుంది. ఆ రాత్రి గుండిచా మందిరానికి చేరుకుని, స్వామిని తనవెంట రమ్మంటుంది. దశమి వరకూ రావడం సాధ్యంకాదన్న జగన్నాథుడితో జగడమాడి, కోపంతో రథచక్రాన్ని ధ్వంసం చేస్తుంది. అమ్మవారి పేరుమీదుగా ఈ క్రతువునంతా అర్చకులే నిర్వహిస్తారు. పదోరోజు స్వామి తిరిగి శ్రీక్షేత్రానికి చేరతాడు. దీన్నే బహుడా యాత్రగా చెబుతారు. ఇక రథయాత్రలోని అంతిమ ఘట్టాన్ని నీలాద్రి బిజె అని అంటారు.
**రథాలమీద ఉన్న ముగ్గురు మూర్తులను ఆలయంలోనికి తీసుకెళ్లే వేడుక ఇది. దీనికి ముందు అలిగిన లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్నాథుడు అమ్మవారికి రసగుల్లాలు తినిపిస్తాడని అంటారు.
**రథ నిర్మాణమిలా…
రథయాత్ర కోసం తయారుచేసే రథాల నిర్మాణాన్ని కూడా ఒక యజ్ఞంగా నిర్వహిస్తారిక్కడ. రథాల తయారీకి అవసరమైన వృక్షాలను ఎంపిక చేసి, వాటిని 1072 కాండాలుగా నరికి పూరీకి తరలిస్తారు. వీటిని తిరిగి 2188 ముక్కలుగా ఖండిస్తారు. వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం, 703 భాగాలతో బలభద్రుడు, 593 భాగాలతో దేవీ సుభద్ర రథాలను తయారుచేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష్‌ అంటారు. ఎర్రటి చారలతో ఉన్న పసుపురంగు వస్త్రంతో దీన్ని ముస్తాబు చేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అంటారు. నీలిరంగు వస్త్రంతో దీన్ని అలంకరిస్తారు. దేవీ సుభద్ర రథాన్ని దర్పదళన్‌ అంటారు. నలుపు వస్త్రంతో ఈ రథం కనువిందు స్తుంది.
1.ముగ్గురు మూర్తులకు సింగారం
ముగ్గురుమూర్తుల సింగారం సేవలు పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనొ(చీకటి) మందిరంలో సోమవారం ఏర్పాటయ్యాయి. ఆరోగ్యవంతులైన పురుషోత్తమ, బలభద్ర, సుభద్ర(ముగ్గురు మూర్తులు)లకు ఆషాఢ బహుళ త్రయోదశి నాడు ‘బొనొకొలగి’ సేవలు ఏర్పాటవుతాయి. జ్యేష్ట పౌర్ణమి నాటి స్నానయాత్ర, తదనంతర ఆయుర్వేద చికిత్సలు, లేపనాల వల్ల ముగ్గురు మూర్తుల ఛాయ తగ్గుతుంది. నవయవ్వన దర్శనానికి ముందురోజు ఆకుపసర్లు, ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన రంగులు అద్దుతారు. దీంతో దేవదేవుల రూపాలు తేజోవంతమవుతాయి. దీన్ని బొనొకొలగి సేవలుగా పేర్కొంటారు. దైతాపతి సేవాయత్‌లు ఈ గోప్య సేవలు నిర్వహించారు.
*ముగ్గురు మూర్తులకు ‘ఖొయి’ సమర్పణ
ఆనవాయితీ మేరకు సోమవారం ఒనొసొనొ మందిరంలో ముగ్గురు మూర్తులకు ‘ఖొయి’(తీపి పేలాలు) అర్పించారు. దత్త మహాపాత్ర్‌ సేవకులు ఇవి ప్రత్యేకంగా తయారుచేసి త్రయోదశి నాడు కోలుకున్న దేవదేవులకు నైవేద్యం చేస్తారు.
*పరిమిత భక్తులకు పరమాణిక్‌ టిక్కెట్లు
శ్రీక్షేత్రంలో మంగళవారం నేత్రోత్సవాన్ని పురస్కరించుకుని యంత్రాంగం ప్రత్యేక(పరమాణిక్‌) దర్శనానికి ఏర్పాట్లు చేసింది. శ్రీక్షేత్రం ఆవరణలోని బుకింగ్‌ కౌంటర్‌లో దర్శనం టిక్కెట్లు విక్రయిస్తారు. దర్శనార్ధులకు దక్షిణ ద్వారం మీదుగా లోపలికి అనుమతిస్తారు. సాధారణ భక్తులు సింహద్వారం మీదుగా ఆలయం లోపలికి వెళతారు. సమాచారశాఖాధికారి లక్ష్మీధరపూజాపండా సోమవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సాధారణ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పరిమితం చేశామని, ఉదయం ముగ్గురు మూర్తుల దైనందిన సేవల తర్వాత 9 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.
2. చరిత్రలో ఈ రోజు/జూలై 2చెరబండరాజు
1843: హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం (జ.1755).
1982 : ప్రముఖ విప్లవకవి చెరబండరాజు మరణం(జ.1944).
1961 : అమెరికా రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత మరియు పాత్రికేయుడు ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం(జ.1899).
1965 : ప్రముఖ తెలుగు హాస్య నటుడు కృష్ణ భగవాన్ జననం.
1995 : సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు , దూరవిద్య ప్రముఖుడు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి గడ్డం రాంరెడ్డి మరణం(జ.1929).
2002 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి మరణం(జ.1933).
4. శుభమస్తుతేది : 2, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 5 ని॥ నుంచి
మర్నా తెల్లవారుజాము 0 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న ఉదయం 9 గం॥ 23 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 13 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : చతుష్పాద
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 32 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 21 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)
హుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మిథునము
5. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు మంగళవారం 02-07-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం……
శ్రీవారి దర్శనానికి 12 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ 01 న 83,183 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.30 కోట్లు.
6. శ్రీసూర్యనారాయణస్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీల్లో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులకు పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలో వివిధ రంగాల నిపుణుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించడానికి, ఉత్తమ ప్రజా ప్రతినిధులుగా సమాజంలో మెలగడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు సమయం కేటాయిస్తామని, ఈ సమావేశాల్లో అందరి సభ్యులు పాల్గొని తమ వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తమ్మినేని అభిప్రాయం వ్యక్తం చేశారు.
7. వారి సేవ‌లో సినీన‌టి స‌మంత
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత, ద‌ర్శకురాలు నందినీరెడ్డి మంగ‌ళ‌వారం దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. నందినీరెడ్డి ద‌ర్శక‌త్వంలో సమంత న‌టించిన ‘ఓ బేబి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
8. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ త‌గ్గింది. శ్రీ వారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. 83,183 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగింది. నిన్న 30,755 మంది భ‌క్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం…ప్రస్తుతం ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శనాల విభజనను రద్దు చేయాలని టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాల్సివుందని గతంలో పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన ఆయన, త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తరువాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
9. జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. జూలై 4, 5వ తేదీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు భజన మండళ్ల సభ్యులు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 4న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశమిస్తారు. జూలై 6న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు. పూర్వకాలంలో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతోంది. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.