NRI-NRT

తానాలో భోజనాలకు కటకట. స్వేదాన్ని ఆస్వాదిస్తున్న అతిథులు.

తానాలో భోజనాలకు కటకట. స్వేదాన్ని ఆస్వాదిస్తున్న అతిథులు.

2023 తానా మహాసభల్లో భోజనాల పరిస్థితి మరింత దిగజారింది. బ్యాంక్వెట్ రోజున చేసిన తప్పిదాలనే నిర్వాహకులు రెండోరోజు శనివారం పునరావృతం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భోజనం వడ్డించుకునే స్టాళ్ల సంఖ్య పెంచకపోవడంతో ఉన్న తక్కువ సమయంలోనే(కేవలం 2గంటల్లో) వేలాది మంది భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ద్వారాల వద్ద వేలాది మంది ప్రవాసులు భారీగా గుమ్మిగూడి తోపులాటలకు ఆస్కారమవుతోంది.

స్టాళ్ల సంఖ్య సరిగానే ఉందని, ఆహారాన్ని స్టాళ్ల వద్దకు తీసుకుని వెళ్లే ఉద్యోగులు సమయం అయిపోయిందని ఆహారాన్ని తొలగిస్తున్నారనే వాదనలను ఓ ప్రవాస అతిథి కొట్టిపారేశారు. సమయం అయిపోతే భోజనం ఆపేయవచ్చునని, కానీ సమయానికే భోజనశాలకు వచ్చినవారు 2గంటలకు పైగా చెమటలో తడిచిపోయి వేచిచూడాల్సిన అగత్స్యం ఏర్పడింది వాపోతున్నారు. నెపాన్ని అనవసరంగా సిబ్బందిపైకి తోసి తప్పించుకుంటారని మండిపడ్డారు.

వెంకయ్యనాయుడుని కలవాలని వచ్చామని, కానీ బాలకృష్ణ అభిమానులను చూసి ఆ అవకాశం లేకపోవడంతో భోజనశాల వద్దకు సమయానికి వచ్చినప్పటికీ 2గంటలకు పైగా లైనులో వేచి ఉండి భోజనం చేసి అలసిపోవడం వలన గదికి వెళ్తున్నామని తానాలో ఈ దుస్థితికి బాధ్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని లక్ష్మీ గొట్టిపాటి అనే ప్రవాస మహిళా ఆవేశంతో ఊగిపోయారు. వేల మందికి 4స్టాళ్లు ఎలా సరిపోతాయనే మౌలిక సూత్రాన్ని పాటించలేని నిర్వాహకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. కన్వీనర్ పొట్లూరి రవి నెంబరు కావాలని ఆమె బ్యాడ్జీలు ధరించిన పలువురు తానా సభ్యులను అడగడం గమనించిన ప్రవాసులు ఆమెకు మద్దతు తెలిపారు.

View post on imgur.com