ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అని పెద్దలు ఊరికే అనలేదు. కోసే సమయంలో ఉల్లిపాయ కన్నీళ్లు తెప్పించినా.. అందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ కూరలో అయినా ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే చాలా మంది పొట్టును మాత్రం తీసి పక్కన పడేస్తుంటారు. ఉల్లిపాయ మాత్రమే కాకుండా దాని పొట్లు వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలీదు. ఒకటి కాదు రెండు కాదా ఏకంగా ఏడు లాభాలు ఉన్నాయనే విషయం తెలిస్తే.. ఇకపై మీరు చచ్చినా ఉల్లిపాయ పొట్టును పక్కన పడేయరు. ఇంతకీ ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.వంటింట్లో ఏ కూరగాయ లేకున్నా.. ఉల్లిపాయ మాత్రం విధిగా ఉంటుంది. కూర ఏదైనా ఉల్లిపాయ మాత్రం విధిగా ఉండాల్సిందే. అయితే ఉల్లిపాయతో పాటూ దాని పొట్టులో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలీదు. యాంటీఆక్సిడెంట్లతో పాటూ ఫైబర్, విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చర్మం, జుట్టు, కంటి చూపును మెరుగుపరచడంలో ఇది ఉల్లి పొట్టు చాలా బాగా పని చేస్తుందట. ఉల్లి పొట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.
* ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీనివల్ల ఇది చర్మంపై దురదలు, దద్దుర్లు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఉల్లిపాయ తొక్కల రసాన్ని చర్మంపై రాసుకోవడం వల్ల చాలా సమస్యలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ఉల్లిపాయ తొక్కల రసంతో చేసిన టీ తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఊబకాయం, అధిక రక్తపోటు, వివిధ ఇన్ఫెక్షన్లను తగ్గించి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయ తొక్కలను నీటిలో సుమారు 20 నిముషాల వరకు ఉడకబెట్టాలి. తద్వారా వచ్చిన రసంతో టీ చేసుకుని తీసుకోవచ్చు.
* ఉల్లిపాయ తొక్కల రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా పలు ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటూ పెరుగుదలకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. వెంట్రుకలు ద్రుఢంగా ఉండేందుకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. ఉల్లిపాయ తొక్కలను గోధుమ రంగు వచ్చే వరకూ వేడి చేయాలి. తర్వాత దాన్ని పేస్టులా మార్చి, అందులో కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ డై లాగా ఉపయోగించుకోవచ్చు.
* ఉల్లిపాయ పొట్టులో మన శరీరానికి అవసరమయ్యే ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటివి మిలితమై ఉంటాయి. దీంతో ఈ పొట్టును వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
* ఉల్లిపాయ పొట్టులో ఎల్-ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఉల్లి పొట్టు టీ తీసుకోవడం వల్ల నరాలన్నింటికీ ఉపశమనం కలుగుతుంది. తద్వారా నిద్ర బాగా పట్టేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఉల్లిపొట్టుతో చేసిన డ్రింక్ తోసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
* ఇళ్లలో దోమల నివారణకూ ఉల్లిపాయ పొట్టు పని చేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రాకుండా ఉంటాయి.
* జుట్టు పొడిబారడంతో పాటూ నిర్జీవంగా మారిన సమయంలో ఉల్లిపాయ పొట్టును హెయిర్ టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ పొట్టును గోధుమ రంగులోకి వచ్చే వరకూ ఉడకబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.
* అంతేకాదండోయ్ మనుషులకు మాత్రమే కాదు మొక్కలకు కూడా చాలా మంచిది,దీన్ని మొక్కలకు కంపోస్ట్ ఎరువుగా కూడా వాడవచ్చు.చీడ పీడల నుంచి కాపాడుతుంది.ఇంకా చెప్పాలంటే మంచి దిగుబడికి దోహదం చేస్తాయి.అందుకే ఇప్పటి నుంచి ఉల్లిపాయ తొక్కలను వేస్ట్ చెయ్యకండి.వాటిని మీకు నచ్చినట్లు వాడుకోండి.