Devotional

వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆనవాయితీ ప్రకారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు భక్తులు పోటెత్తారు. ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ సిబ్బంది మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని మంత్రి తెలిపారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ దత్తాత్త్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆపార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. పాడిపంటలతో రైతులు, తెలంగాణ ప్రజలు అలరారుతూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని తెలిపారు. అమ్మవారికి చల్లని దీవెనలతో బీజేపీ అధికారంలోకి వస్తే నాడు మాటల్లో చెప్పిన బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తామని ఈటల అన్నారు.