DailyDose

రాష్ట్ర నేతలతో సమావేశం కానున్న నడ్డా-TNI నేటి తాజా వార్తలు

రాష్ట్ర నేతలతో సమావేశం కానున్న నడ్డా-TNI నేటి తాజా వార్తలు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

 ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటలు సమయం పడుతోంది. దర్శనం అనంతరం భక్తులు ఆలయ పరిసరాల్లో ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.

నేడు, రేపు వర్ష సూచన

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, అన్నమయ్య, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, బాపట్ల, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, అనంతపురం, విజయనగరం, తిరుపతి, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వివరించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 86,781 మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 44,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.47 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

* రామనారాయణ రెడ్డికి చెక్ పెడుతోన్న వైసీపీ

నెల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం కుటుంబాన్ని దూరం చేసి చూడలేం.. జిల్లా రాజకీయాల్లో చేరపలేని ముద్ర ఆనం కుటుంబానిది.. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి మొదలు, ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి.. ఇలా ఆ కుటుంబం పేరు ప్రస్తావన రాగానే దశాబ్దాల రాజకీయ చరిత్ర చర్చకు వస్తుంది. 80 సంవత్సరాల రాజకీయ చరిత ఆనం కుటుంబానికి ఉంది.. వివేకానందరెడ్డి సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి, మరో ఇద్దరు సోదరులు.. ఈ ఇద్దరూ కవలలు.. జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి.. ఆనం వివేకా జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన రోజుల్లో రాష్ట్ర స్థాయిలో తమ్ముడు రామనారాయణ రెడ్డి ఉంటే.. మరో ఇద్దరు తమ్ముళ్లు జయ, విజయ్ లు ఆనం రాజకీయ కోటకు సింహపురి ద్వార పాలకులు లాంటి వారు అనే పేరుంది. అలాంటిది వివేకానందరెడ్డి మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆనం వివేకా మరణం తర్వాత అప్పటిదాకా టిడిపిలో ఉండి.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. అంతకంటే ముందే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మరో సోదరుడు జయ కుమార్ రెడ్డి మాత్రం టిడిపిలోనే ఉన్నారు.

సాయిచంద్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న CM KCR

ప్రముఖ జాన‌ప‌ద గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా నేడు సాయిచంద్ దశదినకర్మ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హస్తినాపురంలో సాయి చంద్ దశదినకర్మ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు పలువురు తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.సాయిచంద్ చిత్రపటానికి సీఎం కేసీఆర్, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ సాయి చంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయి చంద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ముఖ్యంగా కేసీఆర్ సభలో సాయి చంద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. సాయిచంద్ తన ఆటపాటతో ప్రజలను తన వైపు తిప్పుకునేవారు.

రాష్ట్ర నేతలతో సమావేశం కానున్న నడ్డా

 రాష్ట్ర బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నడ్డా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే 11 రాష్ట్రాల అధ్యక్షులతో నడ్డా బీజేపీ కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే.

* ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 15.1 సెంటీమీటర్ల వర్షం పడింది. 2013 జూలై-21న అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నిన్నటి వర్షపాతంతో దశాబ్ద కాలం నాటి రికార్డు బద్దలైంది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో అనేక జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ధనసరి సీతక్క నేడు (జులై 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. “ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.చంద్రబాబు ట్వీట్ పట్ల సీతక్క స్పందించారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ ఆత్మీయంగా బదులిచ్చారు. కాగా, సీతక్క ఈసారి అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆమె అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీతక్క యూట్యూబ్ లో పంచుకున్నారు.

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన KCR దంపతులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఆదివారం సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

మోదీ సభకు దూరంగా వివేక్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి మరో షాక్ తగులనుంది. బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట వివేక్, విజయశాంతి. నిన్న వరంగల్‌ లో జరిగిన ప్రధాని మోడీ సభకు డుమ్మా కొట్టిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి.. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోది. బీజేపీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు వీ6 ఛానల్ ఓనర్, బీజేపీ నేత గడ్డం వివేక్.అయితే.. తాజాగా ప్రధాని మోడీ వరంగల్ పర్యటనలో సైతం కూడా కనిపించలేదు వివేక్, విజయశాంతి. దీంతో వివేక్, విజయశాంతి ఇద్దరూ బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. వీ6 ఛానల్ ఓనర్, బీజేపీ నేత గడ్డం వివేక్… మళ్లీ బీఆర్‌ఎస్‌ కు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివేక్‌ కు బీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయట. వీ6 ఛానల్‌ ఉండటంతో.. వివేక్‌ ను మళ్లీ బీఆర్‌ఎస్‌ లోకి రమ్మని గులాబీ బాస్‌ కేసీఆర్‌ పిలిచారట. ఇక విజయశాంతి పార్టీ మారడంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.