WorldWonders

41.5 కోట్ల మంది పేదలకు విముక్తి

భారత్‌లో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి నిక్షేపంగా ఉన్నారు

భారత్‌లో 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం (Poverty) నుంచి బయటపడ్డారు. ఐరాస (UN) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP), ఆక్స్‌ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (OPHI)’లు కలిసి తాజాగా ‘అంతర్జాతీయ బహుళ కోణ పేదరిక సూచి (MPI)’ను విడుదల చేశాయి. భారత్‌, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం తదితర 25 దేశాలు తమ పేదరికాన్ని.. 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నాయని పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరికం నిర్మూలన దిశగా వేగవంతమైన పురోగతిని సాధించగలమని ఈ గణాంకాలు చాటుతున్నట్లు తెలిపింది.‘అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధి (2005-06 నుంచి 2019-21)లో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం.. 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయింది. 2005-06లో దేశంలో దాదాపు 64.5 కోట్ల మంది బహుళ కోణ పేదరికంలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు.. 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గారు. ఆయా సూచికల్లో తగ్గుదల నమోదైంది. పేద రాష్ట్రాలు, గ్రూపులు అత్యంత వేగవంతమైన పురోగతి నమోదు చేశాయి’ అని ఐరాస నివేదిక పేర్కొంది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ‘ఎంపీఐ’ని రూపొందించారు.

2023 ఎంపీఐ గణాంకాల ప్రకారం.. 110 దేశాల్లోని 610 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. వారిలో 84 శాతం మంది గ్రామీణులే. 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది 18 ఏళ్లలోపువారే. మొత్తం పేదల్లో సబ్-సహారా ఆఫ్రికాలో 53.4 కోట్ల మంది, దక్షిణ ఆసియా 38.9 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురు పేదల్లో దాదాపు ఐదుగురు ఇక్కడివారే. మూడింట రెండొంతుల మంది పేదలు మధ్య- ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ దేశాల్లో పేదరిక నిర్మూలన చర్యలు ముఖ్యమని ఐరాస అభిప్రాయపడింది. అయితే, పేదరిక తగ్గుదలపై కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉందని తెలిపింది.

భారత్‌లో ఆయా సూచికల్లో పేదల తగ్గుదల.. పోషకాహార లేమీ: 44.3- 11.8,వంట ఇంధనం: 52.9- 13.9,పారిశుద్ధ్యం: 50.4- 11.3.తాగునీరు: 16.4- 2.7, విద్యుత్‌ సౌకర్యం: 29- 2.1, గృహనిర్మాణం: 44.9- 13.6,శిశుమరణాలు: 4.5- 1.5.