Politics

మరోసారి విదేశీ పర్యనటకు ప్రధాని మోదీ

మరోసారి విదేశీ పర్యనటకు ప్రధాని మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు (France tour) బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. జులై 13, 14 తేదీల్లో మోదీ అక్కడ పర్యటిస్తారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ (Narendra Modi) అక్కడ పర్యటించనున్నారు. ఈసారి ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని హాజరుకానున్నారు.జులై 14న పారిస్‌లో జరిగే ఫ్రాన్స్‌ నేషనల్‌ డే పరేడ్‌లో మోదీ పాల్గొంటారు. ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్‌లో గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి. ప్రధాని గౌరవార్థం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు అధికారిక విందుతో పాటు ప్రైవేటు విందును కూడా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రితోపాటు సెనెట్‌, నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షులతోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాసి భారతీయులు, భారత్‌, ఫ్రెంచ్‌ సంస్థల సీఈవోలు, ఇతర ప్రముఖులతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ.. తిరుగు ప్రయాణంలో జులై 15న యూఏఈలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నయాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్‌, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని తెలిపింది.