యూకే వెళ్లాలనుకునే వారిపై రిషీ సునాక్ ప్రభుత్వం రుసుముల పిడుగు వేసింది. వీసా దరఖాస్తు చార్జీలను, ఆరోగ్య సర్‌చార్జీలను భారీగా పెంచుతూ ప్రధాని రిషీ సునాక్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. యూకే వెళ్లాలనుకునే భారతీయులు, ఇతర దేశాల వారిపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఈ పెంపుదల త్వరలోనే అమలులోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారులు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెల్లించే రుసుములు, ఆరోగ్య సర్‌చార్జి భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునాక్ ప్రభుత్వం ప్రకటించింది. టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల జీతాలను 5 నుంచి 7 శాతం పెంచాలంటూ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. ద్రవ్యోల్బణం, ఇతర పరిస్థితుల్లో వీసా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నానని సునాక్ చెప్పారు. జీతాల పెంపుపై ఇదే తుది నిర్ణయమని, దీనిలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.