ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అధునాతన సాంకేతిక యుగంలో ఇప్పుడొక సంచలనం. చూస్తుండగానే ఈ కృతిమ మేధ మన జీవితంలో అడుగుపెట్టేసింది. ఏఐ చాట్‌బాట్‌తో పిల్లల హోంవర్క్ మొదలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోడింగ్ వరకూ ప్రతీది మునివేళ్లమీది పనిలా మారిపోయింది. ఇటీవల ఓ అమెరికా మహిళ ఏకంగా ఏఐ చాట్‌బాట్ ద్వారా రెప్లికాను తయారు చేసి, పెండ్లి కూడా చేసుకొన్నది. ఆయనే తన పర్ఫెక్ట్ జోడీ అని మురిసిపోయింది. తాజాగా, ఏఐ న్యూస్ యాంకర్లు కూడా హల్చల్ చేశారు. స్టార్టప్‌లనుంచి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. కాగా, భవిష్యత్తు సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐని మెచ్చుకొనేందుకు ఓ రోజు ఉందని మీకు తెలుసా? ప్రతి ఏటా జూలై 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్రిసియేషన్ డే’ను జరుపుకొంటున్నారు. ఈ రోజున ఏఐ సేవలను ప్రశంసిస్తారు.
రెండువైపులా పదునున్న కత్తి…ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండువైపులా పదునున్న కత్తి అని మరికొంతమంది నిపుణులు అభివర్ణించారు. ఈ కృత్రిమ మేధతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. ఏఐతో ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని, భవిష్యత్తులో చాలామందికి ఉపాధి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో ఏఐ కారణంగా 23 శాతం ఉద్యోగాలు ఊడుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు ఈ కృత్రిమ మేధతో ముప్పు పొంచి ఉన్నదని తెలిపింది. తాజాగా, దుకాణ్ అనే ఈ కామర్స్ స్టార్టప్ 90శాతం మంది ఉద్యోగులను తొలగించి, వారిస్థానంలో ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. అదే సమయంలో ఏఐతో కార్మికశక్తి ఉద్పాతకత పెరుగుతుందని మెకిన్సీ వెల్లడించింది. కార్మిక ఉత్పాదక వృద్ధి 2040 నాటికి 0.1 నుంచి 0.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది