మనలో కలిగే అనేక భావాలను ఎదుటి వారికి వ్యక్తం చేసేందుకు మనకు అనేక పదాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సార్లు వాటిని మనం మాటల రూపంలో, కొన్ని సార్లు చేతల రూపంలో.. ఇంకొన్ని సార్లు హావ భావాల రూపంలో వ్యక్తం చేస్తాం. దీంతో ఎదుట ఉన్నవారు మన భావాలను కచ్చితంగా అంచనా వేస్తారు. అయితే ఎవరైనా మన ఎదురుగా ఉన్నప్పుడు వారికి మన భావాలను ఫేస్ టు ఫేస్ తెలపగలుగుతాం. కానీ వారు ఎక్కడో దూరంగా ఉంటే..? మనం ప్రస్తుతం ఏ భావంతో ఉన్నామో.. ఎక్కడో ఉన్నవారికి ఎలా తెలుస్తుంది..? మనం ఏడుస్తున్నామా..? నవ్వుతున్నామా..? కోపంగా ఉన్నామా..? అనే విషయాన్ని ఎక్కడో దూరంలో ఉన్నవారికి తెలిపేందుకు మనమేం చేస్తాం..? ఆలోచిస్తే.. అది కొంచెం కష్టంగా ఉంది కదా.. అయితే అలాంటప్పుడే మనకు ఎమోజీలు పనికొస్తాయి.
ఎమోజీలంటే డిజిటల్ ఐకాన్లు.. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. మనలో కలిగే అనేక భావాలను ఎదుటి వారికి స్పష్టంగా తెలియజేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అనేక మాధ్యమాల్లో ఎమోజీలు మనకు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా యాప్స్, వెబ్‌సైట్లు, ఇతర అనేక యాప్‌లు, సైట్లలో, ఫోన్లలో.. మనకు ఎన్నో రకాల భావాలను పలికించే ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మనం మనకు దూరంగా ఎక్కడో ఉన్నవారితో చాటింగ్ చేస్తుంటే.. ఆ సమయంలో మనలో ఏ భావం కలుగుతుందో వారికి ఇట్టే చెప్పవచ్చు. మనం కోపంతో ఉంటే కోపంగా ఉన్న ఎమెజీని చాట్‌లో పంపితే చాలు.. అదే ఆనందంగా ఉంటే.. ఆ ఎమోజీ.. ఏడుస్తుంటే.. దానికి ఇంకొక ఎమోజీ ఉంటాయి. దీంతో వాటిని అవతలి వారికి పంపితే వారు మన భావాలను అర్థం చేసుకుంటారు. అయితే అసలు మొదటిసారిగా ఈ ఎమోజీని ఎవరు డిజైన్ చేశారో తెలుసా..?1999లో జపాన్‌కు చెందిన షిగెటక కురిత అనేబడే ఓ డిజైనర్ తొలిసారిగా 175 పిక్సల్స్ సైజ్ ఉన్న ఓ ఎమోజీని డిజైన్ చేశారు. దాన్ని మొబైల్ ఇంటర్నెట్ ప్లాట్‌ఫాంపై తరువాత వాడారు. అప్పటి నుంచి అనేక ఎమోజీలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే మనం నిత్యం వాడే ఎమోజీలకు ఒక రోజు ఉండాలనే నేపథ్యంలో ప్రతి ఏటా జూలై 17వ తేదీని వరల్డ్ ఎమోజీ డేగా పాటిస్తున్నారు. 2014లో లండన్‌కు చెందిన జెరెమీ బర్గ్ అనే ఓ వ్యక్తి ఈ వరల్డ్ ఎమోజీ డేను ప్రారంభించారు. అయితే జూలై 17వ తేదీనే ఎందుకంటే.. యాపిల్‌కు చెందిన ఐఫోన్లలో క్యాలెండర్ ఎమోజీలో తేదీ జూలై 17 అని ఉంటుంది. అందుకనే దాన్ని ఆ రోజున ప్రారంభించానని జెరెమీ బర్గ్ చెబుతున్నాడు.
ఇక వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫేస్‌బుక్ ఓ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇక లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో వరల్డ్ ఎమోజీ డే 2019 సందర్భంగా ఓ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. అందులో రక రకాల ఎమోజీలను మనం చూడవచ్చు. దీంతోపాటు ఓహియో, పెన్సిల్వేనియాలలోనూ వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా పలు ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా సాఫ్ట్‌వేర్ సంస్థలతోపాటు అనేక కార్పొరేట్ సంస్థలు తమ కంపెనీలు, ఉత్పత్తులకు చెందిన అనేక ఎమోజీలను కూడా విడుదల చేస్తుంటాయి.. మరి ఈ సారి వరల్డ్ ఎమోజీ డేకు ఏయే కంపెనీలు ఎలాంటి ఎమోజీలను విడుదల చేస్తాయో చూడాలి..! ఏదేమైనా.. ఎమోజీలతో మనకున్న బంధం విడదీయలేనిది.. కాబట్టి హ్యాప్పీ ఎమోజీ డే..!