రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్‌లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్‌లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్‌లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్‌తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్‌లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది.ఈ కొత్త ట్రైన్‌ల కోసం లోకోమోటివ్‌లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)లో, కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది.
ఈ ఏడాది చివరి నాటికి…ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి.