సింగపూర్ పార్లమెంటును అక్రమ సంబంధాల వ్యవహారం కుదిపేస్తోంది. ఇదే విషయమై పార్లమెంట్ స్పీకర్‌తోపాటు ఓ మహిళా ఎంపీ రాజీనామా చేసిన రెండు రోజులకే మరో వ్యవహారం వెలుగు చూసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన భారత సంతతి వ్యక్తి లియాన్ పెరేరా (Leon Perera) తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే పార్టీకి చెందిన మహిళా ఎంపీతో అక్రమ సంబంధం ఉందనే విషయం బయటకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణలో భాగంగా వారి మధ్య ఉన్న సంబంధం వాస్తవమని తేలినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి (Workers’ Party) చెందిన లియాన్ పెరేరా (53), నికోల్ సీహ్ (36)లు అక్కడి పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ వివాహితులే. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వీరిద్దరికి సంబంధించి తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడం చర్చకు దారితీసింది. పెరేరా, నికోల్‌లు ఇద్దరూ ఓ డైనింగ్ టేబుల్ వద్ద చేతులు పట్టుకొని కూర్చున్న వీడియో ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొట్టింది.
అయితే, ఈ ఇద్దరూ తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో కలుసుకునేవారని, చేతులు పట్టుకొని, ఆలింగనాలు కూడా చేసుకునేవారని పెరేరా డ్రైవర్ 2021లోనే తమకు ఫిర్యాదు చేశాడని పార్టీ వెల్లడించింది. తాజా వీడియోలోనూ ఇద్దరు సీనియర్ సభ్యులు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు కనిపించిందని తెలిపింది. ‘2020 సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిద్దరూ సంబంధాన్ని కొనసాగించారు. కానీ, కొంతకాలం తర్వాత దానికి ముగింపు పలికారు’ అని వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ ప్రీతమ్ సింగ్ వెల్లడించారు. తొలుత ఈ విషయాన్ని ఇరువురూ ఖండించినప్పటికీ చివరకు దీన్ని అంగీకరించారని అన్నారు. ఆ మహిళా ఎంపీ కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేసిందన్నారు.మరోవైపు అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) ఎంపీ చెంగ్ లీ హుయి, పార్లమెంట్ స్పీకర్ టాన్ చువాన్-జిన్‌ల మధ్య ఈ తరహా సంబంధం ఉందన్న వార్త సంచలనం రేపింది. దీంతో ఆ ఇద్దరూ జులై 17న పార్లమెంటు సభ్యత్వంతోపాటు తమ పార్టీకీ రాజీనామా చేశారు. పీఏపీ పార్టీ ప్రమాణాలకు అనుగుణంగా వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు. వారి అనుచిత ప్రవర్తనను మానుకోవాలని గత ఫిబ్రవరిలోనే హెచ్చరించినప్పటికీ ఆ సంబంధాన్ని కొనసాగించారన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే ప్రతిపక్ష పార్టీల ఎంపీల వ్యవహారం వెలుగు చూడటంతో సింగపూర్ పార్లమెంటులో ఈ అంశం చర్చనీయాంశమయ్యింది.