Business

చాట్‌జీపీటీకి పోటీగా యాపిల్‌జీపీటీ-TNI నేటి వాణిజ్య వార్తలు

చాట్‌జీపీటీకి పోటీగా యాపిల్‌జీపీటీని-TNI నేటి వాణిజ్య వార్తలు

ఒక లీటర్ పెట్రోలుకు ఏకంగా 28 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు 

మన దేశంలో కారు లేదా బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్ మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న ఎంత మైలేజీ ఇస్తుంది. కార్లు లేదా మోటార్‌సైకిళ్ల విక్రయంలో ఇంధన సామర్థ్యం ఎప్పటికీ ప్రధాన USPగా ఉంటుంది. కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలే అత్యధికంగా అమ్ముడైన వాహనాలుగా ఉన్నాయి.  ఇటువంటి వాహనాలు చౌకగా ,  చిన్నవిగా ఉంటాయి. అవి లీటరు పెట్రోల్‌కు గరిష్ట మైలేజీని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తాయి..ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మైలేజీని ఇచ్చే పెట్రోల్ కార్లు ఏవో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో భారతదేశంలో అత్యంత మైలేజీనిచ్చే కార్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కాలం మారిపోయింది. S-ప్రెస్సో సాంప్రదాయ చిన్న ఇంజన్, లైట్ కార్ ఫార్ములాకు కట్టుబడి 25 kmpl మైలేజీని అందిస్తుంది.ఈ జాబితాలోని తదుపరి కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, దాని మైలేజీకి సంబంధించి చాలా డిమాండ్ ఉంది. టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ కారు నాల్గవ స్థానంలో ఉంది, మారుతి సుజుకి S-ప్రెస్సోను తక్కువ తేడాతో వదిలివేసింది. మారుతి సుజుకి వ్యాగన్ R 25.19 kmpl మైలేజీని ఇస్తుంది.

ఒప్పో రెనో10 5జీ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం

 ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో10 5జీ ప్రీ-బుకింగ్స్ గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్ లైన్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఒప్పో రెనో10 5జీ ఫోన్ రూ.32,999 (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై బుక్ చేసుకున్న వారికి రూ.3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఒప్పో రెనో10 5జీ ఫోన్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఒప్పో రెనో10 5జీ ఫోన్ 6.7-అంగుళాల (1080×2412 పిక్సెల్స్) ఓలెడ్ 3డీ కర్వ్‌డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తున్నది. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13- బేస్డ్ కలర్స్ ఓఎస్ 13పై పని చేస్తుంది.ఒప్పో రెనో10 5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.7 లెన్స్ ఆటో ఫోకస్ అండ్ ఓఐఎస్, 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.ఈ నెల 10న ఒప్పో రెనో10 5జీ ఫోన్‌తోపాటు ఒప్పో రెనో10 5జీ, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒప్పో రెనో10 5జీ ప్రో ధర రూ.39,999, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్ ధర రూ.54,999గా నిర్ణయించింది. ఒప్పో రెనో10 ప్రో 5జీ, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఆన్ లైన్ స్టోర్, దేశంలోని అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.

10వేలే.. 108మెగా ఫిక్సెల్‌ కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ రూ.10వేల ధరలో బడ్జెట్‌ ధరలో సీ53 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.9,999 బడ్జెట్‌ ధరలో విడుదలైన ఈ ఫోన్‌ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనక భాగంలో 108 ప్రైమరీ కెమెరాతో రానుంది. రియల్‌మీ సీ53 4జీబీ ప్లస్‌ 128 జీబీ, 6జీబీ ప్లస్‌ 64 జీబీ వేరియంట్స్‌ ఫోన్‌లను అందించనుంది. జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు సమయంలో పరిచయ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్‌ పొందవచ్చు. రియల్‌మీ సీ 53.. 6.74 అంగుళాల 90 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్‌ టూ బాడీ రేషియో 90.3శాతం, 560 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, 108 ఎంపీ ఆల్ట్రా క్లియర్‌ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, ఫోన్‌ ఫ్రంట్‌ సైడ్‌ 720 పీ/30 ఎఫ్‌పీఎస్‌ వీడియో రికార్డింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇస్తుంది. నానోకార్డ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్‌లు ఉన్నాయి. బ్లాక్‌, బ్లూ కలర్‌ వేరియంట్‌లో లభ్యం కానుంది.  

పాల ధరలు మళ్లీ పెరిగే అవకాశం

ప్రస్తుతం ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ సామాన్యులకు లేదు. తిండి, పానీయాలు అన్నీ ఒక్కొక్కటిగా ఖరీదు అవుతున్నాయి. మొన్నటి వరకు పెరిగిన టమాటా ధరలు ప్రజలపై మరింత భారం మోపాయి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఖరీదైన పాలు కంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పశుగ్రాసం ఖరీదు కారణంగా త్వరలో పాల ధరలు కూడా నాలుగైదు శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేరుగా ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ఖరీదైన పాలు కారణంగా పెరుగు, మజ్జిగ, స్వీట్లు, లస్సీ, పన్నీర్‌ కూడా ఖరీదైనవి కావచ్చు. లీటర్‌ పాలపై మూడు రూపాయలు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.హిందుస్థాన్ వార్తాపత్రికలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. పశుగ్రాసంతో పాటు పశుగ్రాసం కూడా 25 శాతం పెరిగింది. ఇది పాల ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇప్పుడు రైతులు పాడి పశువుల ఆహారంపై గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పాలను డెయిరీ కంపెనీలకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. పాల కంపెనీలు కూడా పాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసిన తర్వాత అధిక ధరకు పాలను ఖరీదైన రేటుకు విక్రయిస్తున్నాయి.అయితే పాల ధరలు పెరగడం కొత్త విషయం కాదు. గత దశాబ్దంలో పాల ధరలు 57 శాతం పెరిగాయి. గత ఏడాది కాలంలోనే పాలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. దీని ధరల్లో రూ.10 పెరుగుదల నమోదైంది. గత మూడేళ్ల ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, పాల ధర 22 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో కరోనా కాలం నుంచి పాల ధరలు మరింత పెరిగాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే పాలు, దాని ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

అమ్మకాల్లో ఐఫోన్‌కు పోటీ

స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) ట్రెండ్‌ మారింది.. కొన్నేళ్ల క్రితం వరకు సింగిల్‌ స్క్రీన్‌ ఫోన్లవైపు మొగ్గుచూపిన యూజర్లు, క్రమంగా మడతఫోన్లపై మనసుపారేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం వరుసగా మడతఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే శాంసంగ్‌, షావోమి, మోటోరోలా, హానర్‌ వంటి సంస్థలు మడత ఫోన్ల మార్కెట్లోకి అడుగుపెట్టాయి. తాజాగా హానర్‌ (Honor)కంపెనీ చైనాలో విడుదల చేసిన హానర్‌ మ్యాజిక్‌ వీ2 (Honor Magic V2) ఫోల్డింగ్‌ ఫోన్‌ అమ్మకాల్లో యాపిల్‌ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. చైనాలో ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు కొనేందుకు ఎక్కువ మంది ఉపయోగించే జేడీ.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో యాపిల్‌ ఐఫోన్ 14 ప్రో మొదటి స్థానంలోఉండగా, మ్యాజిక్‌ వీ2 రెండో స్థానంలో, ఐఫోన్‌ 13 మూడో స్థానంలో ఉన్నాయి. త్వరలోనే మ్యాజిక్‌ వీ2ను యూరప్‌, ఆసియా మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు హానర్‌ కంపెనీ ప్రకటించింది. 

రిలయన్స్ కొత్త షేర్ల ధర ఎంతంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారం ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్’ జూలై 20న విడిపోయింది. డీమర్జర్  తర్వాత, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ పేరు ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్’ (JFSL) గా మార్చారు. రిలయన్స్ కొత్త కంపెనీ.డీమర్జర్ కోసం, ఈ రోజు ఉదయం 9 నుండి 10 గంటల వరకు ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ జరిగింది. దీనిలో కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ ధర రూ. 261.85గా నిర్ణయించారు. డీ మర్జర్ తర్వాత ఈ సెషన్‌లో, RIL కొత్త స్టాక్ ధర రూ.2,580గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ సూచికలలో త్వరలోనే భాగం కాబోతోంది. జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. ఇది 1 నుండి 2 నెలల్లో లిస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు. బ్రోకరేజ్ నివేదిక ప్రకారం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. డీమర్జర్ తో భారతదేశంలో 8వ అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ NBFC లైసెన్స్‌ని కలిగి ఉంది. 

యాపిల్‌ వాచ్‌ కొత్త ఫీచర్‌ వచ్చేసింది

యాపిల్‌  వాచ్‌  భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.  గుండెకు  స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్‌ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.  AFib అనేది  క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది  ఒక రకమైన అరిథ్మియా. గుండె  దడ , వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన  చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్‌ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.

రిషి సునాక్‌తో టాటా చంద్రా భేటీ

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. బ్రిటన్‌లో గ్లోబల్ బ్యాటరీ సెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రిషి సునాక్‌ను చంద్రశేఖరన్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బ్రిటన్‌లోని వార్‌విస్క్ షైర్‌లో గల జాగ్వార్ లాండ్ రోవర్ గాయ్డన్ సెంటర్‌లో వీరు కలుసుకున్నారు. టాటా కంపెనీ 400 కోట్ల పౌండ్లపై చిలుకు (రూ.42 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. యూరప్ లోనే ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ కానున్నది. గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని టాటా సన్స్ ప్రకటించడం బ్రిటన్‌లోని ఆటోమోటివ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.ప్రపంచ దేశాలన్నీ సంప్రదాయ పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా అడుగులేస్తున్న వేళ.. బ్రిటన్లో బ్యాటరీల తయారీకి గ్లోబల్ బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ ముందుకు వచ్చింది. మొబిలిటీ, ఇంధన రంగ అవసరాల కోసం అత్యంత నాణ్యత, హై పెర్పార్మెన్స్ సుస్థిర బ్యాటరీ సెల్స్, ప్యాక్స్ లను బ్యాటరీ సెల్ గిగా ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. దేశీయంగా ఒక ఏడాది ఈ ఫ్యాక్టరీ ఏడాది పాటు 40 గిగావాట్ల సామర్థ్యం గల సెల్స్ తయారు చేయాల్సి ఉంటుంది.టాటా సన్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న న్యూ గిగా ఫ్యాక్టరీ వల్ల బ్రిటన్‌లో నాలుగు వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. 2026లో ఈ న్యూ గిగా ఫ్యాక్టరీ .. బ్యాటరీ సెల్స్ తయారీ ప్రారంభిస్తుంది. బ్రిటన్‌లో బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్ కార్లకు వాటిని సరఫరా చేస్తారు. బ్రిటన్‌లో జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ లగ్జరీ కార్లు, ఎస్‌యూవీ కార్లను టాటా మోటార్స్ తయారు చేస్తున్నది. బ్రిటన్‌లో జాగ్వార్ లాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ త్వరలో ప్రారంభిస్తామని టాటా సన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

*  చాట్‌జీపీటీకి పోటీగా యాపిల్‌జీపీటీని

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI)పై మరో టెక్‌ దిగ్గజం దృష్టిపెట్టింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా వంటి సంస్థలు ఏఐ విషయంలో ముందడుగు వేయగా.. తాజాగా యాపిల్‌ (Apple) సైతం సొంత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారించింది. చాట్‌జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ తరహాలో ఏఐ చాట్‌బాట్‌ను యాపిల్‌ సిద్ధం చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థ తెలిపింది. ఏఐపై యాపిల్ పనిచేస్తోందన్న వార్తల నేపథ్యంలో యాపిల్‌ షేర్లు 2 శాతం మేర పెరగ్గా.. మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌ షేర్లు ఒక శాతం మేర క్షీణించాయి. Ajax అనే లాంగ్వేజ్‌ మోడల్‌తో చాట్‌జీపీటీ తరహాలో చాట్‌బాట్‌ను యాపిల్‌ ఇంజినీర్లు పరీక్షిస్తున్నట్లు తెలిసింది. అంతర్గతంగా దీనికి ‘యాపిల్‌ జీపీటీ’గా (Apple GPT) నామకరణం చేశారు. ఇందుకోసం పలు బృందాలు పనిచేస్తున్నట్లు తెలిసింది. యాపిల్‌ అభివృద్ధి చేస్తున్న ఈ వర్చువల్‌ అసిస్టెంట్‌ చాట్‌జీపీటీ, బార్డ్‌ తరహాలోనే టెక్స్ట్‌కు ఆన్సర్‌ ఇస్తుంది. ప్రస్తుతానికి అంతర్గతంగా ప్రొడక్ట్‌ ప్రోటోటైపింగ్‌ కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై యాపిల్‌ అధికారికంగా స్పందించలేదు.

ఈ బేబీ పౌడర్ కంపెనీకి భారీ షాకిచ్చిన కోర్టు

పిల్లల చర్మం మృదువుగా ఉండేందుకు, చెమట నుంచి రక్షించడానికి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం మార్కెట్ నుండి బేబీ టాల్కమ్ పౌడర్ తీసుకువస్తుంటారు. మార్కెట్లో పేరెన్నికగన్న కంపెనీల అనేక బ్రాండ్లు బేబీ పౌడర్‌ను విక్రయిస్తాయి. కానీ ఈ ఉత్పత్తులు మీ బిడ్డపై ఇంత భయంకరమైన, చెడు ప్రభావాన్ని చూపుతాయని మీకు తెలియదు. ఇదిలా ఉంటే ఓ ప్రముఖ బేబీ పౌడర్ కంపెనీకి కోర్టు ఝలక్ ఇచ్చింది. రూ.154 కోట్ల జరిమానా విధించారు. ఈ సంస్థ ఉత్పత్తి కారణంగా క్యాన్సర్‌ ప్రమాదం పొంచి ఉందన్న ఆరోపణ ఉంది. ఇంతకుముందు మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఈ కంపెనీ ఉత్పత్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఉత్పత్తి నిలిపివేయాలని కంపెనీని ఆదేశించింది. దీనిపై కంపెనీ హైకోర్టు తలుపు తట్టింది.ఇది గ్లోబల్ బ్రాండ్ కంపెనీ అయిన జాన్సన్ అండ్‌ జాన్సన్ విషయంలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కంపెనీ పిల్లల కోసం టాల్కమ్ పౌడర్‌ను తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే ఓ కేసులో అమెరికా కోర్టు ఈ కంపెనీకి 154 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ ఉత్పత్తి క్యాన్సర్‌కు కారణమైందని ఓ వ్యక్తి ఆరోపించారు. ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వాపోయారు.ఈ కేసు అమెరికాలో ఉంది. ఆంథోనీ హెర్నాండెజ్ వాలాడెజ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ వ్యక్తి వాదన ప్రకారం.. అతను చిన్నప్పటి నుంచి ఈ కంపెనీ బేబీ పౌడర్‌ను ఉపయోగిస్తున్నాడు. అయితే ఆ తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. టాల్కమ్ పౌడర్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని ఆయన కేసు వేశాడు. ఈ పౌడర్‌ను ఎక్కువ కాలం వాడడం వల్ల ఛాతీ దగ్గర మెసోథెలియోమా అనే క్యాన్సర్ వచ్చిందని కోర్టుకు తెలిపాడు. ఇక తర్వాత కంపెనీ కోర్టు ముందు వాదించింది. జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఉత్పత్తి పూర్తిగా సురక్షితం. ఈ టాల్కమ్ పౌడర్ ప్రత్యేక తెలుపు రంగు గాలి చొరబడని కంటైనర్‌లో ప్యాక్‌ చేసి ఉంటుందని కంపెనీ కోర్టుకు వివరించింది. ఉత్పత్తి సురక్షితమైనదని, ఉపయోగం కోసం తగినదని కంపెనీ పేర్కొంది. ఈ కేసులో లీగల్ ఫీజులు, ఇతర ఖర్చులను నివారించడానికి కంపెనీ ఒక పరిష్కారాన్ని ప్రారంభించింది.