తెలంగాణ పోలీసుల తీరును నిరసిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. పోలీసులు తనపట్ల అగౌరవంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బాటసింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకున్న తీరుపై కిషన్ రెడ్డి లేఖలో ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు అడ్డుకోవడంతో కేంద్రమంత్రి రోడ్డుపైనే నిరసనకు దిగారు.పోలీసులు సభా హక్కులను ఉల్లంఘించారన్నారు. ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బాటసింగారంలోని డబుల్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓఆర్ఆర్‌పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారంనాడు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఇలాంటి అణచివేత ధోరణి సరైంది కాదన్నారు. ఇవాళ జరిగిన పరిణామాలను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తామంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు.