Business

దేశంలో పెట్రోల్ ధరలు ఏపీలోనే అత్యధికం

దేశంలో పెట్రోల్ ధరలు ఏపీలోనే అత్యధికం

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే  ఆంధ్ర ప్రదేశ్‌ లోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది . ఈమేరకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి లోక్‌ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.111.87, డీజిల్‌ రూ.99.61 మేర ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి ధరలు లేవు. పొరుగు రాష్ట్రాలైన, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఏపీ కంటే రేట్లు తక్కువగా ఉన్నాయి.

కేంద్రం వెల్లడించిన వివరాలు ప్రకారం గరిష్టంగా ఏపీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 111.87 గా ఉంది. ల‌క్షద్వీప్‌లో గరిష్టంగా లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 103. 08గా ఉంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 92.78 మాత్రమే. ఇక ఏపీ కంటే తెలంగాణ‌లోనే పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.66 కాగా, డీజిల్ ధ‌ర రూ. 97.82గా ఉంది. కేర‌ళ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.73 కాగా, డీజిల్ ధ‌ర రూ. 98.53గా ఉంది. ఏపీలోని అమరావతిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.87లు ఉండగా.. డీజిల్‌ ధర 99.61గా ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.పెట్రోల్, డీజిల్, ఇత‌ర పెట్రోలియం ఉత్పత్తుల‌ను దేశ‌మంతా ఒకే ధ‌ర‌ల విధానం ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉందా? అని రాజ‌స్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాహుల్ క‌శ్వాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి లోక్‌స‌భ‌కు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా ఒకే చ‌మురు ధ‌ర‌ల విధానం ఇప్పటి వ‌ర‌కు లేద‌న్న ఆయ‌న‌.. ఆయా రాష్ట్రాల్లో ప‌న్ను ఆధారంగా ధ‌ర‌లు ఉన్నట్టు తెలిపారు