గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించాలనుకున్న ఓ యువకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడ్వడంలో వరల్డ్ రికార్డు నెలకొల్పాలన్న అతడి పట్టుదల చివరకు అతడికి కన్నీరునే మిగిల్చింది. నైజీరియాకు చెందిన టెంబు అబెరె.. టిక్‌టాక్ కమెడియన్. అత్యంత ఎక్కువ సమయం ఏడ్చి ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టాలని ప్రయత్నించాడు. ఏకంగా వారంపాటు ఆపకుండా ఏడ్చాడు. అయితే అతడి ప్రయత్నం వికటించింది. ఆపకుండా ఏడ్వడంతో అతడు పాక్షికంగా కంటిచూపును కోల్పోయాడు. కళ్లు, మొహం ఉబ్బిపోయాయి. రికార్డు కోసం అధికారికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడి ప్రయత్నం వృథా అయింది.నైజీరియాలో ఇటీవలి కాలంలో గిన్నిస్ రికార్డుల పిచ్చి ఎక్కువైంది. ఇటీవల ప్రముఖ చెఫ్ ఒకరు ఏకంగా 100 గంటల పాటు వంట చేసి పాపులర్ అయ్యారు. రికార్డుకు కొద్ది దూరంలో నిలిచిపోయినా, దేశ ఉపాధ్యక్షుడు, ఇతర సెలబ్రిటీల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. అనంతరం గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ నైజీరియన్లకు గిన్నిస్ సంస్థ సూచించింది.