Health

ఈ వ్యాధిని ఒక చుక్క రక్తంతో ముందుగానే గుర్తించవచ్చు

ఈ వ్యాధిని ఒక చుక్క రక్తంతో ముందుగానే గుర్తించవచ్చు

ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయంతోపాటే వార్ధక్య వ్యాధులూ పెరుగుతున్నాయి. ఎముకలను గుల్లబార్చే రుగ్మత (ఆస్టియోపొరోసిస్‌) కూడా ఇందులో ఒకటి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు.. చుక్క రక్తాన్ని విశ్లేషించడం ద్వారా.. ఓ వ్యక్తికి ఆస్టియోపొరోసిస్‌ ముప్పు పొంచి ఉందా?లేదా? అన్నది గుర్తించడంలో సాయపడే నూత్న బయోసెన్సర్‌ను అభివృద్ధి చేశారు. సింగిల్‌ న్యూక్లియోటైడ్‌ పాలీమార్ఫిజమ్స్‌ (ఎస్‌ఎన్‌పీ)అనే జన్యు వైరుధ్యాల వల్ల ఆస్టియోపొరోసిస్‌ ముప్పు పెరుగుతుందని పలు పరిశోధనలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సియారా కె ఒసలివాన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చిన్నపాటి విద్యుత్‌ రసాయన సాధనాన్ని అభివృద్ధి చేసింది. అది.. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తం నమూనాలో ఇలాంటి ఐదు ఎస్‌ఎన్‌పీల్లో మూడింటిని వేగంగా గుర్తించగలదు. ఇది వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించే దిశగా ముందడుగు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరీక్ష చౌకలో, 15 నిమిషాల్లోనే పూర్తవుతుందని వివరించారు. ఇందుకోసం పెద్ద ల్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదన్నారు.