Business

ఆదాయపు పన్ను చెల్లింపు ఫీచర్‌ను ప్రారంభించింది:ఫోన్‌పే

ఆదాయపు పన్ను చెల్లింపు ఫీచర్‌ను ప్రారంభించింది:ఫోన్‌పే

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన యాప్‌లో ‘ఆదాయ పన్ను చెల్లింపు’ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఇది యూపీఐ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను ఉపయోగించి నేరుగా యాప్ నుంచి సెల్ఫ్-అసెస్‌మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేందుకు పన్ను చెల్లింపుదారులకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ను అందించేందుకు ఫోన్‌పే సంస్థ ప్రముఖ బీ2బీ చెల్లింపులు, సేవల సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లించడాన్ని చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా భావిస్తారు. ఫోన్‌పే దాన్ని అధిగమించేందుకు సౌకర్యవంతమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తోంది.కంపెనీ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా తమ వినియోగదారులు చాలా సులభంగా పన్నులు చెల్లించగలుగుతారని ఫోన్‌పే బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్-ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపై రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ వివరించింది. పన్ను చెల్లింపు తర్వాత పన్ను చెల్లింపుదారులు ఒక వర్కింగ్ డేలోపు యూనిక్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్(యూటీఆర్) నంబర్‌ను రసీదుగా అందుకుంటారు. పన్ను చెల్లింపు కోసం చలాన్‌ను రెండు పనిదినాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.