హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మంగళవారం (జులై 25న) బీజేపీ తలబెట్టిన ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలంటూ బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ధర్నా కోసం పర్మిషన్ ఇవ్వాలంటూ జులై14వ తేదీన పోలీసులకు అప్లై చేశారు బీజేపీ నాయకులు. అయితే.. బీజేపీ ధర్నాకు హైదరాబాద్ పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ నిరాకరించడంతో బీజేపీ నేతలు రాష్ర్ట హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టి ధర్మాసనం ధర్నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని ప్రశ్నించింది. ఇతర ధర్నాలు చేసేవారికి పర్మిషన్ ఇచ్చి…బీజేపీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదన్న ప్రశ్నించింది. బీజేపీ నేతలు ధర్నా పేరుతో సెక్రటేరియట్ ను ముట్టడించే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెయ్యి మందికిపైగా ధర్నాకు వస్తున్నారని.. అందుకే పర్మిషన్ ఇవ్వట్లేదన్న ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
వెయ్యి మందిని కంట్రోల్ చేయలేకపోతే.. పోలీసులు ఇంకెందుకు ఉన్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ధర్నాల వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రావట్లేదా..? అని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు షరతులతో కూడిన ధర్నాకు అనుమతి ఇచ్చింది. 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని సూచించింది. ఎలాంటి ర్యాలీలు చేపట్టొద్దని సూచించింది. జులై 20వ తేదీన బాట సింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ లీడర్స్ ను అడ్డుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు.. కేంద్ర మంత్రులు కూడా బీజేపీ ధర్నాలో పాల్గొంటారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.