DailyDose

రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్-TNI నేటి తాజా వార్తలు

రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్-TNI నేటి తాజా వార్తలు

* గన్నవరంలో హీటెక్కిన రాజకీయాలు

కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న గన్నవరం రాజకీయాలు హీటెక్కాయి. TDP రెబల్ MLA వల్లభనేని వంశీ YCPకి సపోర్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో YCP నుంచి పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు.. ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్రరావుతో భేటీ అయ్యారు. వంశీకి వ్యతిరేకంగా కలిసి నిలబడాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని యార్లగడ్డ చెబుతున్నారు.

*  బాలీవుడ్ యాక్టర్ జయంత్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు.  వృద్ధాప్య సమస్యలతో  బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు కాగా.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. జయంత్ సావర్కర్ ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. తండ్రి మరణంపై కౌస్తుభ్ సావర్కర్ మాట్లాడుతూ..’10-15 రోజుల క్రితం థానేలో లో బీపీకి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చాం. గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కోలుకోలేక ఇవాళ ఉదయం 11 గంటలకు మరణించారు. అని చెప్పారు. 

గ్రూప్-2ను వాయిదా వేయండి

తెలంగాణ స్టేట్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయాన్ని గ్రూప్-2 అభ్యర్థులు ముట్టడించారు. ఆగస్టు చివరిలో జరిగే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దఎత్తున తరలించిన  అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  గ్రూప్-2 రివిజన్‌కు టైమ్ దొరకడం లేదని.. నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. అయితే ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉండేలా చూడాలని టీఎస్‌పీఎస్సీని కోరారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటివకే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఆగస్టు 1 నుంచి 23 గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నాయని.. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లోనే గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయని రెండు పరీక్షలకు దరఖాస్తు  చేసిన పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. రెండు పరీక్షల సెలబస్ వేర్వేరుగా ఉంటుందని.. అందుకే రెండు లేదా మూడు నెలలు వాయిదా వేయాలని వారు కోరారు. అయితే ఇది తమ సమస్యే కాదని.. వరుసగా పరీక్షలు ఉండటంతో సరైన విధంగా రివిజన్‌కు టైమ్ దొరకడం లేదని చెబుతున్నారు. 

పవన్ కళ్యాణ్ కి హరిరామ జోగయ్య లేఖ

వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు మాజీమంత్రి హరిరామ జోగయ్య. వాలంటీర్ల సమస్యని ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు 5000 చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థలో అధిక శాతం వైసీపీ వారే ఉన్నారనేది వాస్తవమని లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య. వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వారే ఎక్కువగా ఉండటం వల్లే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందన్నారు.సంక్షేమ పథకాల అమలు కోసం కంటే అధికార పార్టీ తన ప్రయోజనాల కోసమే వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటుందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ కళ్యాణ్ సంకల్పం మంచిదేనని సమర్థించారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే వారికి పదివేల రూపాయల కనీస వేతనం కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ

తెలంగాణ రాష్ర్టంలో ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని వ్యూహా రచన చేస్తోంది. దీనిపై పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్లు ఆశించే నాయకులు కూడా ముందుగానే తమ పేర్లను ప్రకటించాలని కోరుతున్నారు. ముందుగానే టికెట్లు కేటాయిస్తే బెటర్ అని ఆశావాహలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం గెలుపు గుర్రాల లిస్ట్ ను రెడీ చేస్తోంది.అతి త్వరలోనే తెలంగాణ రాష్ర్టంలోని119  నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం క్రియేట్ చేస్తోంది. మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నారు. ఓవైపు ఎన్నికల హడావుడిని క్రియేట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను పంపిస్తున్నారు. అయితే.. ఈ మధ్య రాష్ర్ట అధ్యక్షుడి మార్పుతో పాటు.. పార్టీలో నెలకొన్న అనిశ్చితి.. నాయకుల మధ్య విబేధాలు కొంత పార్టీని ఇబ్బంది పెట్టాయి. అంతేకాదు.. పార్టీ క్యాడర్ లో జోష్ ను తగ్గించింది.

 ఐదు రోజులు అత్యంత భారీ వర్షాలు

 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, చిరు జల్లులు పడుతున్నాయి.. అయితే, రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది.. ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు వేటకు వెళ్లకూడదంటూ నిషేధం విధించింది.. మరోవైపు.. గత 24 గంటల్లో అత్యధికంగా అల్లూరి జిల్లా చింతూరులో 18 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.

*  రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

AP: విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు స్కూళ్లు, కాలేజీల బంద్ చేపడుతున్నట్లు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (TNSF), AISF వెల్లడించాయి. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 53వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతున్నాయి.

అభిమానుల మృతిపై హీరో సూర్య స్పందన

ఫ్లెక్సీ కడుతూ తన అభిమానులు మృతి చెందిన ఘటనపై తమిళ నటుడు సూర్య స్పందించారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం సూర్యకు తెలిసింది. దీంతో సూర్య మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు వీడియో కాల్‌ చేసి వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని సూర్య భరోసా ఇచ్చారు. మృతుడి సోదరి తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని హీరో సూర్య వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉండటంతోపాటు వారి కుటుంబం బాధ్యత తాను తీసుకుంటానని హీరో సూర్య వీడియో కాల్‌లో భరోసా ఇచ్చారు. ఇకపోతే పల్నాడు జిల్లా కోటప్పకొండ యక్కాల వారిపాలెంకు చెందిన నక్కా వెంకటేశ్(19), పోలూరి శేషులు(20)లు హీరో సూర్యకు వీరాభిమానులు. ఆదివారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

వైకాపా పాలనలో వృక్షాలూ విలపిస్తున్నాయ్‌: పవన్‌ 

 సీఎం జగన్‌ పర్యటనల సందర్భంగా చెట్లు నరికే ప్రక్రియపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేశారు. వైకాపా పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకవద్దని సంబంధిత అధికారులకు సీఎస్ చెప్పాలన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం

కామారెడ్డి జిల్లా డబుల్ బేడ్ రూం ఇండ్లని పేద ప్రజలకి ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలకి డబుల్ బేడ్ ఇస్తానాని చెప్పిన హామీ నిరాశగా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకి అన్యాయం చేసిందని, ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కి పథకాలు గుర్తుకొస్తాయని ఆయన మండిపడ్డారు. దళిత బంధు కామారెడ్డి జిల్లాలో ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం వస్తుందని, తీపి మాటలతో ప్రజలని కేసీఆర్ మభ్య పెడతున్నాడని ఆయన ఆరోపించారు.

* జగన్ పై దేవినేని ఉమ సెటైర్లు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందువల్లే దారిపొడవునా పరదాలు కట్టుకుని… వేల మంది పోలీసులను అడ్డం పెట్టుకుని మరీ ప్రజా రాజధాని ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారని అన్నారు. తాడేపల్లి కొంప నుండి వెంకటాయపాలెం కేవలం ఆరు కిలోమీటర్ల దూరమే…అయినప్పటికి సీఎం జగన్ హెలీకాఫ్టర్ లో వెళ్లాడంటే ఆయన భయం ఏ స్థాయిలో వుందో అర్థమవుతుందని అన్నారు. అందుకే వైఎస్ జగన్ ను పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి అని అంటున్నామని మాజీ మంత్రి ఎద్దేవా చేసారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో హైదరాబాద్‌ నుంచి అమరావతికి ‘రాజధాని టు రాజధాని’ పేరిట అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొలికపూడి శ్రీనివాస్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు పలికారు. కొలికపూడిని కలిసి కొంతదూరం పాదయాత్ర చేపట్టారు మాజీ మంత్రి.ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ…  రాజధాని అమరావతి నిర్మాణం కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతు కుటుంబాలు రోడ్డెకి పోరాటం చేస్తున్నాయని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు, దళిత సోదరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేసారు… ఇలాంటి ఓ సైకో చేతిలో రాష్ట్రం విలవిల్లాడిపోతోందని ఉమ మండిపడ్డారు. ఇక వైఎస్ వివేకా హత్యపైనా ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు. బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న జగన్ రెడ్డి కుటుంబసభ్యుల్లో భయాందోళన మొదలయ్యిందని అన్నారు. సిబిఐ చార్జిషీట్ కొంతమేరకు బయటకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని దేవినేని ఉమ అన్నారు.