Politics

11 ఆహార పరిశుభ్రత ప్రాజెక్టులు ఈరోజు శ్రీకారం

11 ఆహార పరిశుభ్రత ప్రాజెక్టులు ఈరోజు శ్రీకారం

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే టార్గెట్‌గా పెట్టుకున్న సర్కార్‌.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దానిలో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.. ఆరు యూనిట్లను ప్రారంభించడంతో పాటు.. మరో ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం. ఈ రోజు ప్రారంభంకానున్న ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు కాగా.. ఒక మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, మరొకటి ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమ ఉన్నాయి.

ఈ రోజు 6 యూనిట్లకు ప్రారంభోత్సవం.. ఐదు యూనిట్లకు భూమిపూజ జరగనుండగా.. మొత్తం 11 యూనిట్లకు రూ.1,719 కోట్లు ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్‌.. రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్‌ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్‌ రూమ్స్‌ ను కూడా ప్రారంభించబోతున్నారు.. అయితే, ఆపరేషన్‌ గ్రీన్స్‌ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో నిర్మించారు.. ఈ యూనిట్లు.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్‌ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. ఒక్కో యూనిట్‌లో 15 మంది చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 60 మందికి ఉపాధికి లభిస్తుంది. 2,414 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.. ఇక, విజయనగరంలో రూ.4 కోట్లతో ఆరోగ్య మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్‌ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్‌ డీహైడ్రేషన్‌ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేయనున్నారు.