‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). గతేడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’ (Bangarraju)తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తదుపరి సినిమా అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi)తో చేయబోతున్నారు. దానిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా మరో రూమర్ తెరపైకి వచ్చింది. చిరంజీవి- కల్యాణ్ కృష్ణ కాంబో సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంస్థ నిర్మించనుందని, చిరంజీవి తనయ సుస్మిత సహనిర్మాతగా వ్యవహరించనున్నారని ఓ వార్తాసంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందించారు. ఆ వార్తలో నిజంలేదన్న ఆయన సోర్స్‌ని చెక్ చేసుకోవాలని సూచించారు.కొన్ని రోజుల క్రితం తన సతీమణి సురేఖతో కలిసి యూఎస్ టూర్‌కి వెళ్తూ.. తన తర్వాతి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, సుస్మితకు చెందిన ‘గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’లో అది రూపొందనుందని చిరంజీవి తెలిపారు. దర్శకుడి వివరాలు చెప్పలేదు. త్వరలోనే ఈ కాంబోలో సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించగా.. కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధమాకా’, ‘కార్తికేయ 2’వంటి హిట్ చిత్రాల్లో భాగమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజా చిత్రం ‘బ్రో’. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నిర్మాణ సంస్థకు టీజీ విశ్వప్రసాద్ అధినేతకాగా వివేక్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.