* సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని చెల్లిని చంపిన అన్న
అన్నాచెల్లెల అనుబంధం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. ఎందుకంటే.. అన్నంటే చెల్లికి ప్రాణం.. చెల్లెంటే అన్నకు ప్రాణం అనేలా.. ఆప్యాయత.. ప్రేమ, బాధ్యతతో ఇలా కలాకాలం అదే అనుబంధంతో ఉంటారు.. అయితే.. ఓ అన్న తాజాగా దారుణానికి పాల్పడ్డాడు.. చెల్లి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో రగిలిపోయాడు.. ఇంట్లో ఉన్న రోకలి బండతో ఆమెను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్ నగర్ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుందని అన్న సొంత చెల్లిని రోకలి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు.. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే, ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే, ఇది అన్న హరిలాల్ ఇష్టం లేదు.. అతను చాలాసార్లు ఇదే విషయంపై పలు మార్లు హెచ్చరించాడు.ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పై హరిలాల్.. చెల్లి సింధుతో గొడవ పెట్టుకున్నాడు. ఎంత వద్దని చెప్పిన వినట్లేదన్న కోపంతో హరిలాల్ రోకలి బండతో సింధు తలపై కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణికావేశంలో అన్న చేసిన పనికి ఓ చెల్లి ప్రాణం బలైంది.
* కృష్ణా జిల్లాలో దారుణం
కృష్ణా జిల్లాలోని బందరులో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ భార్యను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. హతురాలు పిల్లల డాక్టర్ మహేశ్వరరావు భార్య ముచ్చర్ల రాధగా గుర్తించారు. జవార్పేట సెంటర్లో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర పిల్లల వైద్యశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. తొలుత దుండగులు రాధ కళ్లల్లో కారం చల్లి, తలపై బలమైన ఆయుధంతో దాడి చేశారు. ఆపై ఆమె గొంతు కోశారు. రాధ చనిపోయిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకొని, దుండగులు పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, విచారణ చేపట్టారు.అయితే.. పోలీసుల విచారణలో కొన్ని ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిగువన డాక్టర్ మహేశ్వరరావు ఓపీ నిర్వహిస్తుండగా.. ఇంటిపైనే ఫ్యామిలీ నివసిస్తున్నట్టు పోలీసులు తేల్చారు. రాధ హత్య జరిగిన సమయంలో.. ఆమె భర్త ఓపీలో ఉన్నట్టు తెలిసింది. హంతకుడు ఇంట్లోకి వెళ్ళటానికి ఐదు మార్గాల్లో అవకాశాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 6 నెలల క్రితం.. ఆసుపత్రిలో డబ్బు గల్లంతైన ఘటన జరిగినట్టు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో ఇద్దరు సిబ్బందిని ఉద్యోగాల నుంచి డాక్టర్ తొలగించారు. బహుశా ప్రతీకారంలో భాగంగా.. వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
* పవన్ కళ్యాణ్ పై మహిళా వాలంటీర్ కేసు
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విజయవాడ కోర్టు తిప్పి పంపింది.ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని తెలిపింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోరారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్స్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507,511 ఆఫ్ ఐపీసీ ప్రకారం కేసు దాఖలు చేశారు.విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు.
* బీహార్ కాటియార్‌లో నిరసనకారులపై పోలీసుల కాల్పులు
బీహార్ రాష్ట్రంలోని కాటియార్ లో బుధవారంనాడు నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.మరో ఇద్దరు గాయపడ్డారు. విద్యుత్ పై బార్సోయ్ బ్లాక్ ఆఫీస్ ఆవరణలో ఇవాళ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. గాల్లోకి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని బార్సోయ్ డీఎస్పీ ప్రేమ్ నాథ్ రామ్ ధృవీకరించారు. మృతి చెందిన వ్యక్తిని ఛచ్నాలోని బసల్ గ్రామానికి చెందిన మహ్మద్ ఖుర్షీద్ ఆలం గా గుర్తించారు. గాయపడిన వారిని నియాజ్ గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళనకారులు చెబుతున్నారు.
* ఐదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యం
కళ్ల ముందే కన్న తల్లిని చంపుతుంటే అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. పసివాడు తనేం చేస్తాడులే అనుకన్నాడా నేరస్తుడు. చివరకు ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం అతన్ని కటకటాలపాటు చేసింది. నిందితుడు మరెవరో కాదు సొంత తండ్రే. 2016లో ఐదేళ్ల కుమారుడి ఎదుటే కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు డెంటిస్ట్ ఉమేష్ బోబాలే. కొడుకు చెప్పిన సాక్ష్యం ఆధారంగానే ముంబైలోని సెషన్స్ కోర్టు సోమవారం తండ్రి ఉమేష్‌కు జీవితఖైదు విధించింది.2016 డిసెంబర్ 11న దాదర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే భార్య తనూజను వంట గదిలో కత్తితో కిరాతకంగా గొంతుకోసి చంపాడు ఉమేష్. మృతురాలి శరీరంపై 34 కత్తిగాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. ఈ హత్య జరగడానికి కొన్ని నెలల ముందు ఈ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు. విడాకులు ఖరారైతే భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందని, అందుకే హత్యకుపాల్పడినట్లు రుజువైంది.
* తాత, తల్లిపై దాడి చేసి యువతి అపహరణ
ఓ ప్రేమోన్మాది యువతి తల్లి, తాతలపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధాపురం గ్రామంలో వృద్ధ ముస్లిం దంపతులు నివాసముంటున్నారు. వీరిలో వృద్ధురాలు అనారోగ్యానికి గురవడంతో తణుకు ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఏలూరులో ఉండే ఆ దంపతుల కుమార్తె, మనుమరాలు (20) ఇటీవల పుట్టింటికి వచ్చారు. గతంలో ప్రేమ పేరిట ఆ యువతి వెంటపడిన అదే గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ మంగళవారం తెల్లవారుజామున వారి ఇంటికి వెళ్లి బయట బల్లపై నిద్రిస్తున్న యువతి తాతను తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు. అతడి కేకలు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన యువతి తల్లిపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. తన వెంట రాకపోతే మీ తాతను, తల్లిని చంపేస్తానని బెదిరించి ఆమెను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రి, కుమార్తెలు ప్రస్తుతం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని, అతడి కుమార్తె తలపై సుమారు 50 కుట్లు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
* మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త
కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఫేస్బుక్ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యారు. ఇంట్లో వారికి తెలియకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత యువతి తల్లిదండ్రులు వెతికి తీసుకొచ్చారు. మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయి యువతి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. అయితే, తాజాగా భర్త దారుణానికి పాల్పడ్డాడు. యువతితో సహా, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. తొమ్మి నెలల కొడుకును తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 2020లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో 25ఏళ్ల నజీబుర్ రెహమాన్ బోరా, 24ఏళ్ల సంఘమిత్ర ఘోష్ మధ్య ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయంకాస్త ప్రేమగా మారింది. నజీబుర్ మెకానికల్ ఇంజనీర్. నెలరోజుల తరువాత నజీబుర్ రెహమాన్ బోరా, సంఘమిత్ర ఘోష్ ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను వెతికి పట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబర్ను వివాహం చేసుకుంది. మరుసటి సంవత్సరం సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెపై దొంగతనం అభియోగం మోపారు. పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసి నెలరోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ పొందిన తరువాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు.
* తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి టోకరా
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అందునా.. తక్కువ ధరకే ఇస్తామంటే, జనాలు ఇంకా ఎగబడతారు. ఇప్పుడున్న డిమాండింగ్ రోజుల్లో తక్కువ మొత్తానికే బంగారం సొంతం చేసుకుంటే, లాభం పొందవచ్చన్న ఉద్దేశంతో ముందుకొస్తారు. ఈ బలహీనతనే పసిగట్టి.. ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. తక్కువ మొత్తానికే బంగారం ఇస్తామని ఊరించి.. ఒక వ్యక్తికి కుచ్చటోపీ పెట్టారు. అతని వద్ద నుంచి భారీ సొమ్ము తీసుకొని, నకిలీ బంగారమిచ్చి ఉడాయించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని బూజనూరు ఓ ముఠా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికింది. తాము ఎక్సవేటర్ పనులు చేస్తుంటే, భారీ మొత్తంలో బంగారం దొరికిందని మాయగాళ్లు మాయమాటలు చెప్పారు. అంతేకాదు.. జనాలను నమ్మించడం కోసం కొంత ఒరిజినల్ బంగారాన్ని చూపించారు. అది చూసి నిజమేననుకున్న నరసింహులు అనే వ్యక్తి.. వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వద్ద రూ.7 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తంలో తనకు ఎక్కువ బంగారం ఇవ్వాలని కోరాడు. ఇంకేముంది.. తాము వేసిన వలలో చేప చిక్కుకుందని భావించి, ఆ కేటుగాళ్లు సరేనని తలూపారు. దాంతో.. తాను జాక్‌పాట్ కొట్టేశానని నరసింహులు భావించాడు.
* కేరళలో మోరల్ పోలీసింగ్ కేసు
కేరళలో మరో మోరల్ పోలీసింగ్ ఘటనలో వెలుగులోకి వచ్చింది. కాసర్గోడ్లోని మేల్‌పరాంబ వెళ్లిన ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తుల గుంపును కొంతమంది స్థానికులు ఆపి వేధింపులకు గురి చేశారు. ఈ దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఇద్దరు మహిళలతో సహా నలుగురు స్నేహితులు తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల కోసం మేల్‌పారంబకు వచ్చారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం బేకల్ కోట నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో దారిలో వారు భోజనం చేయడానికి ఓ హోటల్ వద్ద కారు ఆపగా..కొందరు వ్యక్తులు యువకులు తమ కారును వేధింపులకు గురి చేశారని, దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.వారిని తమ కారులో ఎక్కకుండా వారిని ఆపి.. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? అని అడిగారని మేల్పరంబ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. ఈ మేరకు సమాచారం అందగా.. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని .. వేధింపులకు గురి చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు నలుగురి బృందాన్ని ఆపి వేధించినట్లు ఆరోపిస్తూ అధికారి తెలిపారు.
* హైదరాబాద్ వెళ్తున్న ఓ బస్సులో భారీ చోరీ
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద భారీ చోరీ జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద ఆగింది. ఒడిశాలోని బరంపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి టిఫిన్ తినేందుకు అక్కడ దిగాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి బస్సులోని రూ.24 లక్షలు, రూ.4 లక్షలతో వేర్వేరుగా ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ సమయంలో బస్సు సిబ్బంది సహా మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. నార్కట్‌పల్లి హోటల్ వద్ద గత ఏడాదిలోనూ ఇలాంటి రెండు మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి.