Business

లెక్ట్రిక్స్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

లెక్ట్రిక్స్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

అన్నదాత ఖాతాలో 2వేల రూపాయలు

8 కోట్ల మందికి పైగా రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ వరాలు కురిపించారు. జులై 27న పీఎం కిసాన్ యోజన 14వ విడత నిధులు విడుదల చేసింది కేంద్రం. ఈ మొత్తాన్ని డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు పంపించారు. మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు16 వేల కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ అయింది. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో భాగంగా 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు 17,000 కోట్ల రూపాయలను బదిలీ చేసింది కేంద్రప్రభుత్వం. అంతకుముందు భూ రికార్డుల పరిశీలన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ పథకం లబ్ధిదారుల జాబితా నుండి పెద్ద సంఖ్యలో వ్యక్తుల పేర్లు తొలగించబడ్డాయని సమాచారం.ఎందుకంటే..ఈ పథకం లబ్ధిదారుల ఇ-కెవైసిని అప్‌డేట్ చేయకపోవడంతో చాలా మంది రైతులు లబ్ధిదారుల జాబితాలో చేర్చబడలేదు. నవీకరించబడిన లబ్ధిదారుల జాబితా PM కిసాన్ యోజన వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. వివరాల కోసం..ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

 కన్నీటి పర్యంతమైన బైజూస్‌ సీఈవో

జీవితం అన్ని సార్లు ఒకేళా ఉండదు.. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం.. ఒక్క గాలివానతో కూలిపోయినట్టు.. కొన్ని సార్లు తీరన్ని కష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌కు వచ్చింది.. ఈ ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ ఓ వెలుగు వెలిగింది.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే భాషలో.. క్లిష్టమైన సబ్జెక్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చిన బైజూస్‌.. తక్కువ కాలంలోనే ఎంతో మంది ఆదరణ పొందింది.. కొన్ని విద్యాసంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒప్పందాలు చేసుకునే స్థాయికి ఎదిగింది.. అయితే, ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం,ఆ సంస్థ నుంచి ఆడిటర్‌ వెళ్లిపోవడం.. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. అంతేకాదు.. ఏప్రిల్ చివరల్లో బైజూస్ యొక్క బెంగళూరు కార్యాలయాలపై దాడి చేసిన కొందరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత విలువైన విద్య-సాంకేతికత స్టార్టప్‌ను బహిరంగంగా విదేశీ మారకపు ఉల్లంఘనలతో ముడిపెట్టారు. ఇలా వరుసగా కష్టాల్లో చిక్కుకున్న రవీంద్రన్‌.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారట.ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత దుబాయ్‌లో పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడారు రవీంద్రన్‌.. 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ గురించి ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది.. ఆ సమావేశంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని తమతో పంచుకున్నట్టు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. కాగా, రవీంద్రన్ కొన్ని నెలల తరబడి సంక్షోభంలో ఉన్నారు. భారతదేశంలో ఈడీ చేసిన దాడితో పాటు, ఆర్థిక ఖాతాలను సకాలంలో ఫైల్ చేయడంలో విఫలమైంది. అనేక US-ఆధారిత పెట్టుబడిదారులు బైజూస్ అర బిలియన్ డాలర్లను దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి.. సంస్థ యొక్క తొలి పెట్టుబడిదారులలో ఒకరైన ప్రోసస్ ఎన్‌వి బోర్డు నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు.. పేలవమైన ప్రదర్శనకు తోడు, డైరెక్టర్ల సలహాలను పట్టించుకోకపోవడం వల్లే బోర్డు నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.

కొత్తగా ఇండస్ట్రీలు పెట్టేవాళ్లకు గుడ్‌న్యూస్‌

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో టీఎస్‌ఐఐసీ అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడల్లో 1,800 పైచిలుకు ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో ఈ ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే వెసులుబాటు కూడా ఉన్నది. ప్రాజక్టు నివేదిక సిద్ధంగా ఉంటే బ్యాంకు నుంచి రుణాలు పొంది వెంటనే నిర్మాణం పనులు చేపట్టవచ్చు.టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో జిల్లాలవారీగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామికవాడల్లో కొన్ని జనరల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లు కాగా, మరికొన్నింటిని ప్రత్యేక రంగాలకు ప్రత్యేకించారు. ఉదాహరణకు వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లోని ప్లాట్లలో వస్త్ర పరిశ్రమలను, ఖమ్మం బిగ్గుపాడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌లోని ప్లాట్లలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారు. జనరల్‌ పార్కుల్లోని ప్లాట్లలో మాత్రం నిబంధనలకు లోబడి ఎలాంటి పరిశ్రమనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జోన్లవారీగా ఆయా జిల్లాల్లో 500 చదరపు మీటర్ల నుంచి గరిష్ఠంగా 15 ఎకరాల వరకు వైశాల్యం గల ప్లాట్లను సిద్ధం చేసి, స్థానిక భూముల ధరల ఆధారంగా వీటికి ధరలను నిర్ధారించారు. ఖమ్మం, యాదాద్రిలో ప్లగ్‌అండ్‌ప్లే సౌకర్యంతో షెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఔత్సాహికులు ఆన్‌లైన్‌ ద్వారా టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు చేసుకొని ఈ ప్లాట్లను సొంతం చేసుకోవచ్చు.

న్యూస్ డైరెక్టర్ మాధవ్ ను తొలగించిన గూగుల్

మౌంటెన్ వ్యూ బేస్డ్ కంపెనీలో 13 ఏళ్లపాటు పనిచేసిన న్యూస్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మాధవ్ చిన్నప్పను గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా మాధవ్ తన సహచరులకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ చేశారు. గూగుల్‌లో తాను గడిపిన సమయం గురించి రాసుకొచ్చిన ఆయన.. గూగుల్‌లో తన పని గురించి, మరి కొన్ని ముఖ్యాంశాలను కూడా పోస్టులో చర్చించాడు. మాధవ్ గూగుల్‌లో పని చేయడానికి ముందు, BBCలో బిజినెస్ డెవలప్‌మెంట్ & రైట్స్ హెడ్‌గా ఉన్నారు.”నేను ప్రస్తుతం గార్డెనింగ్ సెలవులో ఉన్నాను. ఇది పని, వృత్తి, జీవితం మొదలైన వాటి గురించి ఆలోచించడానికి చాలా సమయాన్ని అందిస్తుంది. ఇక Google గురించి చెప్పాలంటే అందులో దాదాపు 13 సంవత్సరాల పాటు నేను పని చేశానని చెప్పుకునేందుకు గర్విస్తున్నానని చెప్పారు.ఇక తాను ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నానని, తనకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని ఈ సందర్భంగా మాధవ్ చెప్పారు. భారత్ వెళ్లి అమ్మను చూసుకోవాలన్నారు. నెల రోజుల ముందే తాను సంస్థను విడిచిపెడుతున్నానని తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2వరకు మిగిలిన పనులు పూర్తి చేస్తానని మాధవ్ చెప్పారు.గూగుల్ ఈ ఏడాది జనవరిలో దాదాపు 12వేల మందిని తొలగించింది. ఆ తర్వాత కంపెనీ మళ్లీ తన మ్యాపింగ్ యాప్ వేజ్ లో భాగంగా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అప్పట్నుంచి గూగుల్ లో తొలగించబడిన, ప్రభావితమైన వారి కథనాలు ఇలా సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే ఉన్నాయి.

*  లెక్ట్రిక్స్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌

ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ విద్యుత్‌ వాహన విభాగం లెక్ట్రిక్స్‌ ఈవీ, కొత్త విద్యుత్‌ స్కూటర్‌ ‘ఎల్‌ఎక్స్‌ఎస్‌’ను విడుదల చేసింది. ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ3.0, ఎల్‌ఎక్స్‌ఎస్‌ జీ2.0 వేరియంట్లలో లభించనున్న ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1.03 లక్షలుగా ఉంది. కంపెనీ మనేసర్‌ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను తయారు చేస్తున్నారు. అత్యవసర ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌, నేవిగేషన్‌ అసిస్ట్‌, ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్స్‌ వంటి 93 ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇందులో అమర్చిన 2.3 కిలోవాట్‌, 3 కిలోవాట్‌ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ.కు పైగా ప్రయాణాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా విక్రయశాలల్లో ఆగస్టు 16 నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. కార్యకలాపాల విస్తరణ కోసం రూ.500 కోట్లు సమీకరిస్తామని లెక్ట్రిక్స్‌ ఈవీ ఎండీ, సీఈఓ విజయ కుమార్‌ పేర్కొన్నారు.

తగ్గుముఖం పడుతున్న వంటనూనె ధరలు

ఎడిబుల్ ఆయిల్ ధరలు పడిపోయాయి. ధరలు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. ఈ మార్పును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ పోమెలో ఆయిల్ ధరలు ఏడాదిలో బాగా పడిపోయాయి. దీంతో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 29 శాతం, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ ధర 19 శాతం, పోమెలో ఆయిల్ ధర 25 శాతం పడిపోయాయి. ఎడిబుల్ ఆయిల్ చౌకగా మారడంతో ఈ ద్రవ్యోల్బణంలో ప్రజలకు పెద్ద ఊరట లభించింది. వంటగది బడ్జెట్ మరింత కుప్పకూలలేదు.ఎడిబుల్ ఆయిల్ చౌక ధరపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో లిఖితపూర్వక ప్రకటన ఇచ్చింది. ఆయిల్‌ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి ఈ మేరకు ప్రకటన చేశారు. గతేడాది నుంచి ఎడిబుల్ ఆయిల్ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీని వల్ల సామాన్య పౌరులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.భారతదేశం శుద్ధి చేసిన నూనెకు బదులుగా ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం శుద్ధి చేసిన సోయాబీన్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఈ తగ్గింపు కారణంగా రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై సుంకం 13.7 శాతానికి తగ్గింది. ఇందులో సోషల్ వెల్ఫేర్ సెస్ పాల్గొంటుంది. ఇప్పుడు ప్రధానమైన ఎడిబుల్ ఆయిల్‌పై సుంకం 5.5 శాతం.

శామ్‌సంగ్‌ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5 ఫోన్లు

శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌.. గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఈ 2 ఫోన్లు, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ చిప్‌సెట్‌తో వస్తున్నాయి.   1.5 మీటర్ల లోతున నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా కూడా, ఈ ఫోన్లు చెడిపోవనేందుకు దర్పణంగా ఐపీఎక్స్‌8 ధ్రువీకరణ కూడా వీటికి ఉందని సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఆగస్టులో భారత్‌లో విడుదల చేయొచ్చని, ధరలు త్వరలో ప్రకటిస్తారని చెబుతున్నారు. ఫ్లిప్‌ 5 మోడల్‌కు 3.4 అంగుళాల సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే సహా 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ తెర ఉంది. 10 మెగాపిక్సెల్‌ (ఎంపీ) సెల్ఫీకెమేరా, డ్యూయల్‌ 12 ఎంపీ వెనుక కెమేరాలు, 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ వరకు అంతర్గత మెమొరీ ఉంటుంది. ఫోల్డ్‌ 5కు 5 కెమేరాలుంటాయి. ఇందులో 10 ఎంపీ సెల్ఫీ కెమేరా, 4 ఎంపీ డిస్‌ప్లే కెమేరా, వెనుక 3 అధునాతన కెమేరాలుంటాయి. ఈ ఫోన్‌కు 256 జీబీ నుంచి 1 టెరాబైట్‌ వరకు ఎక్స్‌టర్నల్‌ మెమొరీ అమర్చుకోవచ్చు.ఈసీజీ, మహిళల రుతుక్రమాన్ని అంచనా వేసే సదుపాయాలతో గెలాక్సీ వాచ్‌ 6ను శామ్‌సంగ్‌ ఆవిష్కరించింది.

భారత్‌లో అంత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా

మీరు భారతీయ రైల్వేల అత్యంత వేగవంతమైన రైలు, అధిక సౌకర్యాల రైలు, తక్కువ దూరపు రైళ్ల గురించి విని ఉంటారు. అయితే సోమరి రైలు గురించి మీకు తెలుసా? అవును ఒక సోమరి రైలు కూడా ఉంది. ఇది ప్రయాణికులను చాలా నెమ్మదిగా ప్రయాణించేలా చేస్తుంది. ఈ రైలు ప్యాసింజర్ రైలు కంటే నెమ్మదిగా ఉంటుంది. దీని కారణంగా దీనిని భారతీయ రైల్వేలలో అత్యంత నెమ్మదిగా ఉండే రైలు అని కూడా పిలుస్తారు. ఇది డిజైన్‌ పరంగా అందంగా ఉంటుంది. అది వెళ్ళే మార్గం దృశ్యాలు కూడా చాలా అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.భారతదేశంలో అత్యంత నెమ్మదిగా ఉన్న రైలు నీలగిరి మౌంటైన్ రైల్వే గురించి తెలుసుకుందాం. నీలగిరి పర్వతాల గుండా వెళ్లే ఈ రైలును బ్రిటిష్ వారు ప్రారంభించారు. నీలగిరి మౌంటైన్ రైల్వే చాలా నెమ్మదైన రైలు ప్రయాణం కాకుండా అనేక రికార్డులను కలిగి ఉంది. తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో కల్లార్, కూనూర్ మధ్య 20 కిలోమీటర్ల వంపు ఆసియాలోనే అత్యంత ఎత్తైన రైలు అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.భారతదేశం, ఆసియాలో అత్యంత నెమ్మదిగా రైలు అని ఎందుకు పిలుస్తారు? ఇందుకు మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. పర్వతంపై 1.12.28 వాలు ఉందని, రైలు ప్రయాణించే ప్రతి 12.28 అడుగులకు ఒక అడుగు ఎత్తు పెరుగుతుంది. అందుకే దీన్ని భారతదేశంలో అత్యంత నెమ్మదిగా ఉండే రైలు అని కూడా అంటారు. నీలగిరి మౌంటైన్ రైల్వే భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలు. 9 కి.మీ వేగంతో ప్రయాణించే ‘టాయ్’ రైలు ఐదు గంటల వ్యవధిలో 46 కి.మీ. ఇది మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు కంటే దాదాపు 16 రేట్లు వెనుకంజ ఉంటుంది. ఇండియాలో మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు నడిచే ఏకైక ర్యాక్ రైల్వే ఇది.

*  IT రిటర్న్ ఫైల్ చేయడానికి జులై 31 ఆఖరు తేదీ

మీరు ఐటీ రిటర్న్ చేయడానికి గడువు జూలై 31 గా నిర్ణయించారు. మీరు ఇంకా ఫైల్ చేయకుంటే, కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని గుర్తుంచుకోండి. గడువు సమీపిస్తున్నందున ఖచ్చితంగా రద్దీ సమయం పెరగవచ్చు. కాబట్టి ITR ఫైల్ చేయడాన్ని చివరి నిమిషం వరకు వేచి చూసేవారు ఆరోగ్య, జీవిత బీమా, PPF, ELSS, విద్యా రుణం, గృహ రుణం మొదలైన వాటిపై పన్ను మినహాయింపులను మరిచిపోవద్దు. చివరి నిమిషంలో తొందరపడి క్లెయిమ్ చేసేముందు ఈ డిడక్షన్స్ గుర్తుంచుకోండి

*  శ్రీసిమెంట్‌ లాభం రెట్టింపు

 బంగూర్‌ కుటుంబం ప్రమోటర్లుగా ఉన్న శ్రీసిమెంట్‌, జూన్‌ త్రైమాసికంలో రూ.571.94 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.278.86 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే అధికం. ఇదే సమయంలో కార్యకాలాపాలపై ఆదాయం రూ.4414.85 కోట్ల నుంచి రూ.5064.83 కోట్లకు చేరింది. పరిమాణం పరంగా సిమెంట్‌ విక్రయాలు 7.50 మిలియన్‌ టన్నుల నుంచి 8.92 మిలియన్‌ టన్నులకు చేరాయి. వ్యయాలు కూడా రూ.4019 కోట్ల నుంచి రూ.4533.67 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయాలు చూస్తే ఏడాది వ్యవధిలో 19% పెరిగి రూ.5233.90 కోట్లకు చేరాయి.సామర్థ్య విస్తరణ కోసం రూ.7000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. 3.65 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రాజస్థాన్‌లో క్లింకర్‌ ఏర్పాటు కూడా ఇందులో భాగమని వెల్లడించింది. మొత్తం 12 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కొత్త సిమెంటు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో గ్రూప్‌ ఉత్పత్తి 72.4 మిలియన్‌ టన్నులకు చేరుతుందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాలోని ప్లాంటు సహా, కొత్తగా నెలకొల్పుతున్న ఇతర ప్లాంట్లలో కూడా ఉత్పత్తి కార్యకలాపాలు అనుకున్న సమయానికే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ తెలిపారు. ఎన్నికల సంవత్సరమైనందున, కేంద్ర ప్రభుత్వం అధిక వ్యయాలు చేయనుందని, ఇది సిమెంటు రంగానికి కలిసి వస్తుందనే అంచనాను వ్యక్తం చేశారు. బీఎస్‌ఈలో సంస్థ షేరు 2.33% లాభపడి రూ.24,230.05 వద్ద స్థిరపడింది.