Politics

వరదలపై హైకోర్టులో విచారణ

వరదలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై.. ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనలలో ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వరదల్లో ఎంత మంది మరణించారు? బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారా?ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా.. లేదా? అనే విషయాలను తెలపాలి. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలి. వరదలపై పర్యవేక్షణ, సాయం కోసం కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారా? డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఈనెల 31 వరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలి’’ అని హైకోర్టు ఆదేశించింది.