* అమెజాన్ నుంచి ఫ్రీడమ్ సేల్
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో ఆఫర్ల పండగకు సిద్ధమైంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఆ సంస్థ.. త్వరలో మరో సేల్ (Amazon offers) నిర్వహించనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను (Great Freedom Festival sale) తీసుకొస్తోంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఈ సేల్ నిర్వహించనున్నారు.సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 12 గంటల ముందుగానే ఈ ఆఫర్లను పొందొచ్చు. ఫ్రీడమ్ సేల్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, రియల్మీ, రెడ్మీ వంటి స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. కొన్ని ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది. స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్, వైర్లెస్ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం డిస్కౌంట్‌కే అందించనున్నట్లు తెలిపింది. అయితే, ఏయే ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నదీ రివీల్ చేయలేదు. సేల్ తేదీలు దగ్గరపడ్డాక ఆ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రైమ్ డే సేల్‌లో ఆఫర్లను మిస్ అయిన వారు ఈ సేల్‌లో పాల్గొనొచ్చు.
* బెదిరించి మరీ రాజీనామా
ఆర్థిక ఇబ్బందులు.. దర్యాప్తు సంస్థల దాడులు.. ఉద్యోగుల సామూహిక ఉద్వాసనలతో కొన్ని నెలలుగా సతమతం అవుతున్న ఎడ్-టెక్ స్టార్టప్.. బైజూ`స్ కష్టాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. బైజూ`స్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగినిని సంస్థ యాజమాన్యం తొలగించేసింది. తన ఉద్వాసన విషయంలో యాజమాన్యం అనుసరించిన తీరుపై సదరు ఉద్యోగిని కన్నీటి పర్యంతమవుతూ తన లింక్డ్ఇన్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.బైజూస్ యాజమాన్యం తక్షణం రాజీనామా చేయాలని తనను బలవంతంగా చేసిందని ఆరోపించారు. 18 నెలలుగా బైజూ`స్లో అకడమిక్ స్పెషలిస్టుగా పని చేస్తున్న ఆకాంక్ష ఖేమ్కా.. తనపైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తున్నదని వాపోయారు. తన వేతన బకాయిలు చెల్లించనే లేదన్నారు. `వారు (బైజూ`స్) నా వేతన బకాయిలు పే చేయలేదు. ఎర్న్డ్ లీవ్స్ మనీ చెల్లించలేదు. తక్షణం రాజీనామా చేయాలని నాకు లెటర్ పంపారు` అని ఆరోపించారు.బైజూ`స్ మోసాలకు పాల్పడుతున్నదని, ఉద్యోగులనూ కస్టమర్లను మోసగిస్తున్నదని ఆకాంక్ష ఖేమ్కా ఆరోపించారు. తనకు ప్రభుత్వమే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. `నా కుటుంబంలో నేనొక్కదాన్నే ఆదాయం సంపాదించే వ్యక్తిని. నా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నేను రుణాలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వారు (బైజూ`స్) నా వేతన బకాయిలు చెల్లించకుంటే నేనెలా బతకాలి..? ` అని ఆకాంక్ష కన్నీటి పర్యంతం అయ్యారు.
* ఐటీఆర్ ఫైల్ చేశారా
దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే జూలై 31, 2023లోపు ITRని ఫైల్ చేయండి. కొన్నిసార్లు చివరి క్షణంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు వెబ్సైట్లో సమస్య ఎదురవుతుందని గుర్తుంచుకోండి. దీంతో పన్ను చెల్లింపుదారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆగస్ట్ 1, 2023న ITR ఫైల్ చేసిన తర్వాత, మీరు మీ ఆదాయాన్ని బట్టి రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.FY 2022-23, 2023-24 అసెస్మెంట్ ఇయర్ కు సంబంధించిన ITR పన్ను చెల్లింపుదారులు జూలై 31 తర్వాత కూడా ఫైల్ చేయవచ్చు. అయితే అటువంటి పరిస్థితిలో వారు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఈ పెనాల్టీ పన్ను చెల్లింపుదారుల ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే, జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినందుకు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే రూ. 5,000 జరిమానా చెల్లించాలి.పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు ఐటీఆర్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆదాయపు పన్ను శాఖ మీపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. పన్ను ఎగవేతపై ఆదాయపు పన్ను నోటీసుతో పాటు మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఒక పన్ను చెల్లింపుదారుడు రూ. 25 లక్షల కంటే ఎక్కువ పన్ను ఎగవేస్తే, అతనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
* మోటరోలా నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ మోటో జీ14
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లో తన మోటో జీ14 ఫోన్ వచ్చే మంగళవారం ఆవిష్కరించనున్నది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, యూనిసోక్ టీ 616 ఎస్వోసీ చిప్ సెట్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. గత మార్చిలో ఆవిష్కరించిన మోటో జీ13 ఫోన్‌కు కొనసాగింపుగా మోటో జీ14 ఫోన్ వస్తున్నదని తెలుస్తున్నది. మోటో జీ14 ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.11 వేల మధ్య ఉండొచ్చు. మోటో జీ13 ఫోన్ రూ.9999లకే లభించింది. ఆగస్టు ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారంటూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ తన వెబ్సైట్లో మైక్రో సైట్ క్రియేట్ చేసింది.మోటో జీ14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తోపాటు మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది మోటరోలా. 4జీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఇంటర్నల్ స్టోరేజీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.మోటో జీ14 ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యూయ్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఆఫ్ 20 వాట్ల చార్జింగ్ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 34 గంటల టాక్ టైం, 16 గంటల వీడియో స్ట్రీమింగ్కు బ్యాటరీ సపోర్ట్ లభిస్తుంది.
* ఇండిగోకు భారీ షాక్
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగో పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.బెంగళూరు నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్‌లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది.కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్‌వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది.
* ఎన్టీపీసీ సరికొత్త రికార్డు
శుక్రవారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో NTPC షేర్లు 4 శాతం పెరిగి దశాబ్దపు గరిష్ట స్థాయి రూ.209.30కి చేరాయి. ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీ అయిన స్టాక్ గత రెండు వారాల్లో 12 శాతం లాభపడింది. NTPC అక్టోబర్ 2010 నాటితో పోల్చితే ఈరోజు అత్యధిక స్థాయిలో ట్రేడవుతోంది. NTPC మార్కెట్ ధరలో తీవ్ర పెరుగుదల కంపెనీ జనవరి 2008 తర్వాత దాని 2 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ చేరుకునేందుకు సహాయపడింది. BSE డేటా ప్రకారం, NTPC మార్కెట్ క్యాప్ రూ. 2.02 లక్షల కోట్లకు తాకింది. NTPC అనేది గ్రూప్ స్థాయిలో మొత్తం 69134 MW స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ. కంపెనీ 24 శాతం ఉత్పత్తి వాటాతో భారతదేశంలో మొత్తం స్థాపిత సామర్థ్యంలో 17 శాతం కలిగి ఉంది. కంపెనీ 2032 నాటికి 130 GW+ కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో 60 GW విద్యుత్ ఉత్పత్తి పునరుత్పాదక శక్తి ద్వారా జరుగుతుంది.బార్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 660 మెగావాట్ల సామర్థ్యం గల రెండవ యూనిట్ ఆగస్టు 1, 2023 నుండి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుందని NTPC గురువారం ప్రకటించింది. దీని తరువాత, NTPC స్వతంత్ర సామర్థ్యం 57,038 MW, గ్రూప్ వాణిజ్య సామర్థ్యం 73,024 MW గా ఉంటుందని కంపెనీ తెలిపింది. NTPC 2024-26 మధ్యకాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 16,000 మెగావాట్ల బలమైన సామర్థ్యం పెంచేందుకు ప్లాన్ చేసింది, వీటిలో ఎక్కువ భాగం సౌరశక్తిపై ఉంటుంది, అయితే పవన సామర్థ్యం 4000-5000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది.
* ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా రూ. 50 లక్షల వేతనం
అతడు టెకీ కాదు..ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేనేలేదు..అయినా పట్టుబట్టి కోడింగ్ స్కిల్స్‌ను వంటబట్టించుకుని గూగుల్‌లో (Google Offer) రూ. 50 లక్షల వార్షిక వేతనంతో కొలువును సంపాదించాడు. పుణేకు చెందిన సాధారణ డిగ్రీ విద్యార్ధి హర్షల్ జుకర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ముంబైలో పుట్టి పెరిగిన జుకర్ ఇంజనీరింగేతర డిగ్రీ పూర్తిచేశాడు.అయితే ఇంజనీరింగ్ విద్యార్హతలు లేవని నిరాశ చెందని జుకర్ కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. తన నైపుణ్యాలకు నిరంతరం పదునుపెట్టుకుంటూ గూగుల్ కంటపడ్డాడు. జుకర్ కోడింగ్ టాలెంట్‌ను పసిగట్టిన గూగుల్ అతడిలో అత్యున్నత నైపుణ్యాలున్నాయని గమనించి మంచి వేతన ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ చేసింది.ఇక ఐఐఐటీ అలహాబాద్‌కు చెందిన అనురాగ్ మకడే మరో సక్సెస్ స్టోరీతో ముందుకొచ్చాడు. టెక్ స్టూడెంట్ అయిన అనురాగ్ మకడే అమెజాన్‌లో రూ. 1.25 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్ ఫ్రంటెండ్ ఇంజనీర్‌గా అనురాగ్ మకడేకు జాబ్ ఆఫర్ లభించింది.
* పాస్వర్డ్ షేరింగ్‌పై పరిమితి విధించే యోచనలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఇటీవలే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు పాస్వర్డ్ షేర్ చేసుకునే వెసులుబాటును ఆపేసింది. తాజాగా అదే బాటలో మరో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా పాస్వర్డ్ షేరింగ్ లేకుండా నిబంధనలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్ తరహాలో పూర్తిగా నిలిపేయకుండా ప్రీమియం యూజర్లు కేవలం 4 డివైజ్‌లకు మాత్రమే షేరింగ్ చేసుకునే పరిమితి విధించనుంది.దీన్ని మొదట భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో అమలు చేయనుండగా, తర్వాతి దశల్లో విస్తరించనున్నారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం వినియోగదారులు పాస్వర్డ్ ద్వారా 10 డివైజ్‌లలో లాగ్-ఇన్ అయ్యే వీలుంది, ఒకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్ చూసేందుకు అనుమతి ఉంది. అయితే, దీన్ని త్వరలో నాలుగు డివైజ్‌లలోనే లాగ్-ఇన్ అయ్యే పరిమితిని విధించనున్నట్టు సమాచారం.ఈ ప్రక్రియను ప్రయోగ రూపంలో కంపెనీ అంతర్గతంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులోగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల కొంతమంది వినియోగదారులు ఇతర సబ్స్క్రిప్షన్లపై ఆధారపడరని, తద్వారా తమ సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాదికి రూ. 899, రూ. 1,499 ప్లాన్లతో పాటు నెలవారీగా రూ. 299 ప్లాన్‌ను కలిగి ఉంది.
* సాధారణ మెకానిక్‌లు ఇప్పుడు ఈవీ టెక్నీషియన్లు
వారంతా ఒకప్పుడు సాధారణ మెకానిక్‌లు. ఇప్పుడు ఈవీ టెక్నీషియన్స్‌గా మారారు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ASDC) ఎలక్ట్రానిక్ వెహికల్ పరిశ్రమలో టెక్నీషియన్లుగా పనిచేయడానికి 300 మంది సాధారణ టూ వీలర్, త్రీ వీలర్ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. లివ్‌గార్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈవీ పరిశ్రమకు నైపుణ్యత కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అందించడం ఈ చొరవ లక్ష్యం. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని ఆగ్రాలో అభ్యర్థులకు పది రోజులపాటు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈవీ పరిశ్రమలో అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడం, రిపేర్ టెక్నిక్లను మెరుగుపర్చుకోవడంపై ఈ శిక్షణలో తర్ఫీదు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్ అయిన భారత్‌లో మోటార్‌సైకిల్ పరిశ్రమ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోందని టోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీఈవో అరిందమ్ లహిరి పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తగ్గించవచ్చని, పరిశ్రమ డిమాండ్లను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, వేతన ఆధారిత ప్రోత్సాహకాలు, టూల్ కిట్, ఒక సంవత్సరం ప్రమాద బీమా కవరేజీని అందించారు. ఈ సర్టిఫికెట్, టూల్ కిట్లు, ప్రోత్సాహకాలు అభ్యర్థులకు పరిశ్రమలో ఉపాధిని పొందేందుకు, బ్యాంకు రుణాల సహాయంతో సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాయని వివరించారు.
* మార్కెట్లోకి హానర్-90 రీ ఎంట్రీ
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.ఇండియాలో హానర్ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ తేదీ తెలియనప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం సెప్టెంబర్మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేల లోపు ఉంటుందని సమాచారం. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ఫోన్2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. హానర్ 90 ఫోన్ కు సంబంధించి కలర్స్.. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలిగి ఉండనుంది. ఇక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్7 జెన్1 ఎస్ఓసీ, 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా, 50ఎంపీ సెల్పీ కెమెరా, 5000ఎంఏహెచ్‌బ్యాటరీ,66వాట్ఛార్జింగ్సపోర్ట్కలిగి ఉంటుందని అంచనా.