NRI-NRT

TANA: బాల్యదశ నుండి భగవద్గీత అభ్యసించాలి – గంగాధర శాస్త్రి

TANA: బాల్యదశ నుండి భగవద్గీత అభ్యసించాలి – గంగాధర శాస్త్రి

5121 సంవత్సరాల క్రిందట సాక్షాత్తూ కృష్ణ భగవానుడే ప్రవచించిన కార్యగ్రంథం భగవద్గీత సర్వశాస్త్రమయి అని ఆ గ్రంథ పఠనాన్ని బాల్యదశ నుండే అలవడేలా చూడాలని భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గాయకుడు డా.లక్కావఝ్జుల వేంకట గంగాధర శాస్త్రి కోరారు. తానా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో తొలి కార్యక్రమంగా ఫ్రిస్కోలోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో నిర్వహించిన “గీతా గాన ప్రవచనం”లో ఆయన అద్భుత ప్రసంగం చేశారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు గీతను మించిన కరదీపిక మరొకటి లేదన్నారు. వ్యక్తులకు పుట్టినరోజు చేసే సమాజంలో వేల ఏళ్ల క్రిందట పుట్టిన భగవద్గీత అనే ఓ గ్రంథానికి జన్మదిన వేడుకలు చేయగలిగిన శక్తిమంతమైన ఒకే ఒక సమాజం హైందవ సమాజమని కొనియాడారు. హిందువు అంటే సర్వజన బంధువు అని అన్నారు. ధర్మం అంటే స్వకార్యం కాదు లోకకళ్యాణం కలిగించేదని తెలిపారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ప్రతిఫలాన్ని భగవానుడి పాదాలకు వదిలేసి భవబంధాలకు అతీతంగా జీవించడమే హైందవ జీవనమని గంగాధర శాస్త్రి అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తలపెట్టిన గీతాయజ్ఞాన్ని ప్రశంసించారు. స్థానిక చిన్నారులు గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగాన్ని రసోత్కృష్టంగా ఆలపించారు. గీత చదవగలగడం అద్భుతం, అర్థం చేసుకోవడం మహాద్భుతం, ఆచరించగలిగితే పరమాద్భుతమని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన్ను తానా కార్యవర్గ సభ్యులు దుశ్శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

తానా కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ గంగాధర శాస్త్రిని సభకు పరిచయం చేస్తూ పుణ్యజీవి, ధీరోధాత్తుడని కొనియాడారు. హనుమాన్ ఆలయ ఛైర్మన్ డా. వెలగపూడి ప్రకాశరావు మాట్లాడుతూ గీత ప్రారంభ వాక్యం “ధర్మ”, ముగింపు వాక్యం “మమ” రెంటినీ కలిపి “మమ ధర్మ” అంటే స్వధర్మం వదలకుండా చేయమని సూచిస్తోందని…దానికి అనుగుణంగా హిందువులు నిద్రాణ స్థితిని వదిలి, మేల్కొని, ఐకమత్యంగా సమాజంలో జరుగుతున్న అధర్మాన్ని ప్రశ్నించాలని కోరారు.

ప్రవాస అతిథులతో కిక్కిరిసిన ఈ కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సేవల సమన్వయకర్త లోకేష్ నాయుడు, ఫౌండేషన్ ట్రస్టీ పోలవరపు శ్రీకాంత్, మాజీ కార్యదర్శి వేమూరి సతీష్, టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బీరం సుందరరావు, వీర లెనిన్, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, బిందు తదితరులు పాల్గొన్నారు.

LV Gangadhara Sastry Gita Pravachanam in KSHT Frisco By TANA