అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని అందుకునే పరుగులో తాజాగా మరో ప్రవాస భారతీయుడు చేరారు. ఇంజినీర్ అయిన హర్ష్వర్దన్ సింగ్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్నట్లు గురువారం ప్రకటించారు. ఆ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు.ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు…నిక్కీ హేలీ(51), వివేక్ రామస్వామి(37) ఈ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం దీంతో స్పష్టమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలో రిపబ్లికన్ల జాతీయ సదస్సు తేలుస్తుంది.