Agriculture

రేపు తెలంగాణలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన

రేపు తెలంగాణలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన

తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీగా కురిసిన వర్షాలతో దాదాపు వారం నుంచి పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 మంది వరకు మరణించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాలు తేరుకుంటున్నాయి. అయితే, తెలంగాణ సంభవించిన వరద నష్టంపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఈ మేరకు వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా.. పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాలో నష్టాన్ని, పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ అధికారుల బృందంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉండనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (NDMA) సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారు.కేంద్ర అధికారుల బృందం 31 జూలై (సోమవారం) భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనావేస్తుంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను జత చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది.