1. రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం (ఆగస్టు 1న) ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
2. ₹900 కోట్ల విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడాలి: కిషన్ రెడ్డి
వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాలో ఆయన ఇవాళ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లితో పాటు ఇతర గ్రామాల్లోని పరిస్థితిని పరిశీలించారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెన, రహదారులను పరిశీలించి.. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
3. ఆరునెలల బుడతడికి ‘నోబెల్ వరల్డ్ రికార్డ్’
ఆరు నెలల బుడతడు నోబెల్ వరల్డ్ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన పవన్‌కుమార్, సౌమ్య ప్రియ దంపతులకు ప్రజ్వల్ అనే కుమారుడితో పాటు వినీష అనే నాలుగేళ్ల పాప కూడా ఉంది. కుమారుడికి జంతువులు, పండ్లు, వాహనాలు, అంకెలు, పక్షులు, కూరగాయలు తదితర ఫొటోలను చూపి వాటి పేర్లను చెప్పడాన్ని తల్లి సౌమ్య అలవాటు చేశారు.
4. చింతూరును ముంచెత్తిన వరద..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతాన్ని గోదావరి, శబరి నదులు ముంచెత్తాయి. వరదలతో చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లో సుమారు 115 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వరదల కారణంగా గత ఐదు రోజులుగా ఏపీ, తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
5. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ₹81.6లక్షల విలువైన 1.32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతడిపై కస్టమ్ చట్టం 1962 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
6. ఒక్క గంటలోనే 3లక్షలకు పైగా ఐటీ రిటర్నులు
ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు(ITRs) దాఖలు చేసేందుకు గడువు ఇంకా ఒక్కరోజే ఉండటంతో రిటర్నులు సమర్పించేందుకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్ కాగా.. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 46లక్షల మందికి పైగా లాగిన్ అయినట్టు ఐటీ శాఖ వెల్లడించింది.
7. కష్టాలకు వెరవని మహిళా డ్రైవర్.. స్కాలర్‌షిప్‌తో విదేశానికి..!
కుటుంబ పరిస్థితుల దృష్యా టాక్సీ డ్రైవర్‌గా మారారామె. సవాళ్లను ఎదుర్కొంటూ కుటుంబానికి అండగా నిలిచారు. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలను తాజాగా సాకారం చేసుకున్నారు. ఆమే మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన 27 ఏళ్ల కిరణ్ కుర్మవార్ (Kiran Kurmawar).
8. దివ్యాంగుడని కూడా కనికరించలేదు..
కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనందించాల్సిన భద్రతాసిబ్బంది విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. నీళ్లు అడిగాడనే కారణంతో దివ్యాంగుడని కూడా చూడకుండా సచిన్ సింగ్ అనే వ్యక్తిని ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్లు చావబాదారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియాలో చోటు చేసుకుంది. అక్కడికి సమీపంలో ఉన్న వ్యక్తి టెర్రస్‌పై నుంచి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
9. ఐఐటీ బాంబేలో వెజ్-నాన్‌వెజ్ వివాదం..
ఐఐటీ బాంబేలో (IIT Bombay) వెజ్-నాన్‌వెజ్ (non-veg) వివాదం రాజుకుంది. హాస్టల్ క్యాంటీన్‌లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని (Student) మరో విద్యార్థి అవమానించాడు. గత వారం హాస్టల్ 12లో ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్‌లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
10. అమెరికా సైనిక పరికరాల్లో చైనా వైరస్ ‘టైంబాంబ్’..!
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా (USA) సొంతం. కానీ, అటువంటి పరికరాల్లో చైనా (China) టైంబాంబు పెట్టినంత పనిచేసింది. ఓ అజ్ఞాత మాల్‌వేర్‌ను అమెరికా పరికరాల్లోకి చొప్పించినట్లు సీనియర్ సైనికాధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ కాంగ్రెస్ అధికారి కూడా న్యూయార్క్‌టైమ్స్ వద్ద ధ్రువీకరించారు.