దేశ ప్రజల పాదాలకు సరిపోయే విధంగా ‘ఇండియన్ సైజ్’ పాదరక్షలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఇండియన్ ఇంటర్నేషనల్ ఫుట్వేర్ ఫెయిర్లో ఆయన పేర్కొన్నారు. భారతీయ ప్రజలకు సరిపోయే దేశీయ సైజ్ను కనుగొన్నామని, త్వరలోనే దీన్ని తీసుకురానున్నామని చెప్పారు. ఇకపై యూకే, యూఎస్ కొలతలపై ఆధారపడకుండా భారత్ తనకంటూ ప్రత్యేక కొలతలను రూపొందించుకుంటోందని చెప్పారు. మరోవైపు, యూఏఈ, ఆస్ట్రేలియాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు పరిశ్రమకు తోడ్పడతాయని చెప్పారు. మరి కొన్ని నెలల్లో మరిన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్టీఏ) కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఎలాంటి పన్నూ లేకుండానే విక్రయించుకునేందుకు వీలు పడుతుందని చెప్పారు. భారతీయ పాదరక్షలు, లెదర్ పరిశ్రమ దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోందని కొనియాడారు. అంతేగాకుండా 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.