Devotional

తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అధికమాసం సందర్భంగా తిరుమలలో శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ స్థానిక అన్నమయ్య భవన్‌లో స్వామివారికి జరిగే వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

18న ధ్వజారోహణం..సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఈవో వెల్లడించారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం అనంతరం అదే రోజున సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. సెప్టెంబరు 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న మహారథోత్సవం, 26న చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..అక్టోబర్ 14 నుంచి‌ 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో తెలిపారు. 19న గరుడసేవ, 20న పుష్ప పల్లకి సేవ, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. తమిళులు అత్యంత ప్రీతిగా భావించే పెరటాసి మాసం కూడా బ్రహ్మోత్సవాల సమయంలోనే వస్తొందన్నారు. అశేష సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో.. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందన్నారు. గరుడ సేవకు వచ్చే ప్రతి భక్తుడికి వాహన సేవను తిలకించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.