టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమపై దృష్టి పెట్టారు. వివిధ ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు.. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు రెడీ అయ్యారు. అయితే చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్ట్‌ల యాత్రపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో చంద్రబాబు పులివెందుల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ ప్రభుత్వంపై సరమశంఖం పూరించిన చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టారు. ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు టీడీపీ ఆధినేత చంద్రబాబు. జమ్మలమడుగులోని గండికోట రిజర్వాయర్‌ను సందర్శించి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు చంద్రబాబు. ప్రాజెక్టులపై టీడీపీ వాదనను పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో ప్రాజెక్టులకు మొత్తం 12,441 కోట్లు ఖర్చు చేశామని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 5వేల కోట్ల పైచిలుకు ఖర్చుపెడితే.. జగన్ 383 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శిస్తున్నారు. ఇక హంద్రీనీవాను వైసీపీ పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. హంద్రీనీవా ద్వారా గండికోట ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని కడప టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్ట్‌ల యాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు రెడీ అయిపోయారు. చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి అవగాహనే లేదని… చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్జి, రఘురామిరెడ్డి, డిప్యూటి సియం అంజాద్ భాషా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పులివెందులలో అభివృద్ధి జరగలేదని టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. చంద్రబాబు పర్యటనలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలుసని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర చేపట్టారని మండిపడ్డారు. మొత్తంగా రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాయలసీమలో చంద్రబాబు పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.