Politics

ఇండియా ఎన్డీయే కూటముల్లో లేము: కేసీఆర్‌

ఇండియా ఎన్డీయే కూటముల్లో లేము: కేసీఆర్‌

ఇండియా, ఎన్డీఏ కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ఒంటరిగా ఏమీ లేమని, తమతో కలిసి నడిచే మిత్రులున్నారని తెలిపారు. దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నది ఆ కూటముల వారేనని, అయినా మార్పు రాలేదని గుర్తు చేశారు. దేశంలో నూతన మార్పు జరగాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్ర వాటేగామ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్రలో ఎన్నికల సమర శంఖం పూరించామని, అన్ని గ్రామాల్లోనూ తొమ్మిది కమిటీలను నియమిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటికే 50 శాతం గ్రామాల్లో వీటి ఏర్పాటు పూర్తయిందని.. మరో 15 నుంచి 20 రోజుల్లో మిగిలినవి పూర్తి చేస్తామన్నారు. క్రమేణా రాష్ట్రస్థాయి వరకు కమిటీలను వేసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.అమెరికా వంటి దేశంలో వివక్షను విడిచిపెట్టి, నల్ల జాతీయుడు బరాక్‌ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని… వివక్ష పాపాలను కడిగేసుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒబామా అధికారం చేపట్టాక.. నల్ల జాతీయుల జీవితాల్లో మార్పు వచ్చిందని… భారత్‌లోనూ ఆ దిశగా పరివర్తన జరగాలని ఆకాంక్షించారు.