జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీలోని అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 47.17 టన్నుల బంగారు వనరులు ఉన్నాయనిక కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. వైసీపీ ఇప్పుడు ఒకే పని ఇక బంగారం కోసం సెర్చ్ చేయడమేనని విమర్శించారు. ఇందుకు సంబంధించి సినిమాటిక్ స్టైల్లో ఉన్న ఓ కార్టూన్ కూడా షేర్ చేశారు. ‘KGF సిద్ధంగా ఉండు, JGF వస్తుంది’ అని పవన్ పేర్కొన్నారు.
‘వైఎస్సార్సీపీ అడ్వెంచరర్స్ సమర్పించు… జగనన్నస్ గోల్డ్..’’ అని కార్టూన్లో పేర్కొన్నారు. ‘‘నౌవ్ ఓన్లీ టాస్క్, సెర్చింగ్ ఫర్ గోల్డ్ (ఇప్పుడు బంగారం వెతకడమే ఏకైక టాస్క్)’’ అనే ట్యాగ్ లైన్‌ను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, కేజీఎఫ్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఈ పేరుతో తెరకెక్కిన చిత్రం గురించి అందరికి తెలిసిందే. కన్నడ హీరో యష్ నటించిన ఈ చిత్రం.. ప్రధాన కథాంశం బంగారు గనులు, తవ్వకాలు చుట్టూ సాగుతుంది.
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో తన దృష్టి మొత్తం అటువైపుగా మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ తన మకాంను మంగళగిరికి షిఫ్ట్ చేశారు. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఏపీకి వెళ్లి వస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగ్‌లతో కూడా బిజీగా గడుపుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే మంగళగిరికి మార్చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొంత సామాగ్రిని కూడా అవరసం మేరకు మంగళగిరికి తరలించారు. పవన్ కూడా ప్రస్తుతం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే బస చేసేలా.. అక్కడే ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పవన్ ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా పనులు, సినిమా షూటింగ్ షెడ్యూల్లో మాత్రమే పవన్ హైదరాబాద్ వెళ్లునున్నారని సమాచారం. ఎవరైనా సినీ దర్శకులు, రచయితలు పవన్‌తో చర్చలు సినిమాలకు సంబంధించి చర్చలు జరపాలంటే మంగళగిరి వస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.