* రికార్డు స్థాయి ధర పలుకుతున్న కోకాపేట భూములు
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. వేలంలో మాత్రం అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు, అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి.నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో.. ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది.గురువారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 18.47 ఎకరాలకు వేలం కొనసాగుతోంది. ప్రస్తుతం నియో పోలిస్‌లో 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ఈ ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
* 66 లక్షల భారతీయుల అకౌంట్స్ రద్దు చేసిన వాట్సాప్
మెటా(Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) మరోసారి కొరడా ఝుళిపించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంది. 2023 జూన్ నెలలో ఏకంగా 66 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.2023 జూన్ 1 నుంచి 30 మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించగా.. ఇందులో 2,434,200 అకౌంట్లను యూజర్ల నుంచి ఫిర్యాదులు అందక ముందే వేటు వేసింది. వీటికి అదనంగా, వాట్సాప్‌కు 7,893 ఫిర్యాదుల నివేదికలు అందాయని తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.మీరు ఏదేని వాట్సాప్ అకౌంట్‌పై ఫిర్యాదు చేయాలన్నా లేదా అభ్యంతరాలు తెలపాలన్నా వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ సమస్యను వివరిస్తూ grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయవచ్చు.లేదా భారత వాట్సాప్ గ్రీవెన్స్ అధికారికి పోస్ట్ ద్వారా పంపవచ్చు. అభ్యంతరకరమైన, హానికరమైన కంటెంట్‌ను నిలిపివేసేలా వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ షేర్ చేస్తున్న వారి అకౌంట్లను నిషేధిస్తోంది
* ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను
భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రభుత్వం 28 శాతం పన్ను వసూలు చేసే అవకాశం ఉంది. ఇందులో గుర్రపు పందెం, క్యాసినో వంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లకు ఖర్చు చేసే డబ్బు బెట్టింగ్ పరిధిలోకి వచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దానికి చట్టబద్ధత కల్పించి 28 శాతం పన్ను విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దేశంలో ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినో, గుర్రపు పందాలపై పన్ను రికవరీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అదే సమయంలో ఇది అమలులోకి వచ్చిన 6 నెలల తర్వాత ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో వినియోగదారులపై ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.ప్రస్తుతం ఆన్‌లైన్ గేమర్‌లు, పేకాట ఆడేవారు గేమింగ్ కంపెనీ వసూలు చేసే రుసుములతో పాటు, వారు పందెం వేసే లేదా గెలిచిన డబ్బుపై ఎలాంటి అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్త రూల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్కో మొత్తంపై నేరుగా 28% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఆన్‌లైన్ గేమ్‌లు, పేకాట ఆడటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త నియమాల తర్వాత మూడు విషయాలు తెలుసుకోవాలి. మొదటిది గేమ్‌లోని మొత్తం డబ్బుపై 28% పన్ను. రెండవది వారు గెలుచుకున్న డబ్బుపై 30% పన్ను విధింపు, మూడవది గేమింగ్ ప్లాట్‌ఫారమ్ పాల్గొనడానికి దాని స్వంత రుసుములను వసూలు చేస్తుంది. అందువల్ల ఆట ఆడటానికి ఆటగాళ్ళు వివిధ మార్గాల్లో ఎక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది.
* సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్
సిమెంట్ రంగంలో అదానీ గ్రూప్ మరో భారీ కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, అదానీ సిమెంట్‌లో భాగమైన సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. 5,000 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్ ప్రకటించింది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ శ్రీ రవి సంఘీ & ఫ్యామిలీ నుండి కొనుగోలు చేస్తుంది. అంబుజా సిమెంట్స్ ఈ సముపార్జనకు పూర్తిగా అంతర్గత అక్రూవల్స్ నుండి నిధులు సమకూరుస్తుంది.ఈ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ సామర్థ్యం 73.6 MTPAకి పెరుగుతుంది.. 2028 నాటికి 140 MTPA సామర్థ్యాన్ని సాధించాలనే ACL లక్ష్యం ముందుగానే చేరుకుంటుంది. సంఘీ ఇండస్ట్రీస్‌ను దేశంలోనే అతి తక్కువ ధర కలిగిన క్లింకర్ కంపెనీగా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంబుజా సిమెంట్స్ రాబోయే 2 సంవత్సరాలలో సంఘీ ఇండస్ట్రీస్ సిమెంట్ సామర్థ్యాన్ని 15 MTPAకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు ద్వారా చాలా లాభపడుతుందని అంచనా. ఈ కొనుగోలు తర్వాత ACL సిమెంట్ సామర్థ్యం ప్రస్తుత 67.5 MTPA నుండి 73.6 MTPAకి పెరుగుతుంది.
* సంఘీ ఇండస్ట్రీస్‌ను స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ, ప్రముఖ సిమెంట్ కంపెనీ సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5 వేల కోట్ల రూపాయలు. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL)లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘీ, వారి కుటుంబం నుండి కొనుగోలు చేయనుంది. ఈ డీల్ తర్వాత అంబుజా సిమెంట్ షేర్లు 4.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పెరిగాయి.సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు కోసం అంబుజా సిమెంట్స్ పూర్తిగా అంతర్గతంగా నిధులను సమకూర్చుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. అదానీ కంపెనీలపై ఆర్థిక అవకతవకలను ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గ్రూప్ చేసిన మొదటి పెద్ద ఒప్పందం ఇదే. ఈ ఒప్పందం ద్వారా అంబుజా సిమెంట్ తన సామర్థ్యాన్ని సంవత్సరానికి 73.6 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి సహాయపడుతుంది. అంబుజా సిమెంట్ అల్ట్రాటెక్ తర్వాత రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా ఉంది. అంబుజా సిమెంట్, దాని అనుబంధ సంస్థ ACC లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గత సెప్టెంబర్‌లో సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది.సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడం ద్వారా అంబుజా సిమెంట్ లిమిటెడ్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సహాయపడుతుందని ఒక ప్రకటన పేర్కొంది. దీంతో కంపెనీ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 67.5 మిలియన్ టన్నుల నుంచి 73.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ఇదిలా ఉంటే 2023-24 రెండవ త్రైమాసికం నాటికి దహేజ్, అమేథీలలో 5.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ ఫ్యాక్టరీలను సైతం ప్రారంభిస్తుందని ప్రకటన తెలిపింది.
* అన్ని సర్కిళ్లలో 5జీ సేవలు
దేశంలో 5జీ సర్వీసులను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లలో 5జీ సేవలను (Jio 5g) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని జియో ప్రభుత్వానికి తెలియజేసింది. నిర్దేశిత పారామీటర్లు అందుకోవడానికి ఉద్దేశించిన టెస్టింగ్‌కు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు టెలికాం విభాగానికి సమాచారం అందించింది.ఇలా అన్ని సర్కిళ్లలో 5జీ సేవలు ప్రారంభించినట్లు జియో వెల్లడించిన నేపథ్యంలో టెలికాం విభాగానికి టర్మ్ సెల్స్ (డాట్ సబార్డినేట్ ఆఫీసులు) 10 శాతం సైట్లను టెస్టింగ్‌కు ఎంచుకుంటాయి. అన్ని పారామీటర్లలో విజయవంతం అయితే అన్ని సర్కిళ్లలో 5జీ సేవలను తీసుకొచ్చినట్లు ఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. మరోవైపు వేలంలో దక్కించుకున్న 26 GHz, 3,300 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్స్‌ను గుజరాత్ సర్కిల్ జియో విజయవంతంగా పరీక్షించింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 5జీ సేవలు ప్రారంభం కాగా.. టెలికాం కంపెనీలు వేగంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రైవేటు రంగ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ పోటీ పడుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 2.81 లక్షల టవర్లను (బేస్ స్టేషన్ సబ్‌సిస్టమ్) ఏర్పాటు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవు సిన్హ్ చౌహాన్ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. కంపెనీ వారీగా చూస్తే.. జియో 2.28 లక్షల టవర్లను ఏర్పాటు చేయగా.. ఎయిర్‌టెల్ 53 వేల టవర్లను ఏర్పాటు చేసింది. వొడాఫోన్ ఐడియా కేవలం 36 మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* 728బిలియన్ డాలర్లను మించిపోనున్న కార్డ్ చెల్లింపు మార్కెట్
కార్డ్ చెల్లింపు అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ చెల్లింపు భారతదేశంలో భారీగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో ఇది అపూర్వమైన వృద్ధిని చూడగలదని అంచనా. 2022 సంవత్సరంలో 262.1 బిలియన్ డాలర్ల కార్డ్ చెల్లింపు సంఖ్య 2027 సంవత్సరానికి 728.2 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది. గ్లోబల్ డేటా, డేటా, అనలిటిక్స్ సంస్థ ప్రకారం.. ఈ సంఖ్య తెరపైకి వచ్చింది. పెరుగుతున్న వినియోగదారుల ఖర్చు ధోరణి కారణంగా ఈ పెరుగుదల ఆశించవచ్చు.గ్లోబల్ డేటా పేమెంట్ కార్డ్ అనలిటిక్స్ 2022 సంవత్సరంలో భారతదేశంలో కార్డ్ చెల్లింపుల వృద్ధి వేగంగా పెరిగింది. అందులో 26.2 శాతం జంప్ నమోదైందని వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. ఈ ట్రెండ్ 2023 సంవత్సరంలో కూడా కొనసాగుతుందని అంచనా. ఈ కార్డ్ చెల్లింపులలో 28.6 శాతం బలంతో 2023 సంవత్సరంలో 337.2 బిలియన్ డాలర్ల విలువైన కార్డ్ చెల్లింపులను చూడవచ్చు. ప్రధానంగా నగదు ఆధారిత లేదా నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మార్పును చూస్తోంది. దేశంలో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రయత్నాల ఫలితంగా ఇది జరగనుంది. గ్లోబల్ డేటా పరిశోధన ఆధారంగా ఈ విషయం తెరపైకి వచ్చింది.
* అమెజాన్ ఫ్రీడమ్ సేల్
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తీసుకొచ్చిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Great Freedom Festival sale) ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందే సేల్ మొదలైంది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్ మొంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు. ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని అమెజాన్ తెలిపింది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది.శాంసంగ్ గెలాక్సీ M13 ఫోన్‌కు ఈ సేల్‌లో అమెజాన్ పెద్దఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. దీని ఎమ్మార్పీ ధర రూ.14,999 కాగా.. సేల్‌లో భాగంగా రూ.9,464కే విక్రయిస్తున్నారు. ఇటీవల భారత మార్కెట్‌లో విడుదలైన ఒప్పో F23 5G ఫోన్‌పై రూ.2వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఎమ్మార్పీ ధర రూ.24,999 ఉన్న ఈ మొబైల్‌ను రూ.22,499కే అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో రూ.32,999కే అందిస్తోంది. రియల్‌మీ నార్జో 60 ప్రో మొబైల్ ఫోన్ ప్రస్తుత ఎమ్మార్పీ రూ.23,999 ఉండగా.. సేల్‌లో భాగంగా రూ.22,999కే విక్రయిస్తోంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అయిన గెలాక్సీ Z ఫోల్డ్ 5 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,64,999కి విక్రయిస్తుండగా.. సేల్‌లో భాగంగా రూ.1,55,999కే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ తెలిపింది. నాన్ ప్రైమ్ యూజర్లకు 2023 ఆగస్టు 4 నుంచి 2023 ఆగస్టు 8 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
* పెరిగిన వంట నూనెల దిగుమతులు
నల్ల సముద్రం నుంచి సరఫరా ఆగిపోవడం, రిఫైనర్లు రానున్న పండుగల కోసం స్టాక్‌లను పెద్ద ఎత్తున నిల్వచేస్తుండడంతో గతనెల భారతదేశం వంటనూనెల దిగుమతులు రికార్డు స్థాయిలో 1.76 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగాయి. పొద్దుతిరుగుడు నూనెను ఉత్పత్తి చేసే నల్ల సముద్ర దేశాలలో నిల్వలు తగ్గుతున్నాయి. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశ సగటు నెలవారీ వంటనూనెల దిగుమతులు 1.17 మిలియన్ టన్నులుగా ఉన్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఈ) తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో భారతదేశం 1.3 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంది. డీలర్ల సగటు అంచనాల ప్రకారం, పామాయిల్ దిగుమతులు జూన్‌లో 683,133 టన్నుల నుంచి జులైలో 1.09 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఏడు నెలల్లో ఇదే అత్యధికం. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అన్ని దేశాలూ దిగుమతులను పెంచాయని జీజీఎన్ రీసెర్చ్‌లో మేనేజింగ్ పార్ట్నర్ రాజేష్ పటేల్ అన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఒక నెలలో 73శాతం పెరిగి 3,30,000 టన్నులకు చేరుకున్నాయి. రవాణా సమస్యల కారణంగా సోయా ఆయిల్ దిగుమతులు మాత్రం 22శాతం తగ్గి 3,40,000 టన్నులకు పడిపోయాయి.
* త్వరలో టోల్ సిస్టమ్‌లో కీలక మార్పులు
ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైవే టోల్ బూత్‌ల వద్ద వెయిటింగ్ పీరియడ్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్ వసూలు ప్రక్రియలో ప్రభుత్వం గణనీయమైన మార్పు తీసుకురాబోతోంది. త్వరలో అడ్డంకులు లేని టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి టోల్ వద్ద నిర్ణీత టోల్ చెల్లించే బదులు, హైవేపై ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ చెల్లించే విధానం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆగస్టు 2న మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ. అడ్డంకులు లేని టోల్ వసూలు విధానం ప్రస్తుతం పైలట్ దశలో ఉందని, త్వరలో విశ్వవ్యాప్తం చేస్తామని సింగ్ అన్నారు.వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ అమలులోకి వచ్చిన తర్వాత హైవే టోల్ బూత్‌ల వద్ద ఒక్కో వాహనం సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది. ఇప్పుడు కొత్త టోల్ వసూలు విధానం తర్వాత ఈ వ్యవధి 30 సెకన్లకు తగ్గుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.కొత్త టోల్ వసూలు విధానం ఎలా పని చేస్తుంది?: హైవే స్టార్టింగ్ పాయింట్‌తో సహా పలు పాయింట్ల వద్ద కెమెరాలను ఉంచారు. ఈ కెమెరాలు ఇక్కడికి వెళ్లే ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను స్కాన్ చేస్తాయి. హైవేపై ఈ వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందనేది లెక్క. కాబట్టి మీరు ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ చెల్లించాలి.ప్రస్తుతం దీనిని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ విధానాన్ని పరీక్షిస్తున్నారు. ఇది విజయవంతమైతే ప్రభుత్వం అన్ని చోట్లా అమలు చేసే అవకాశం ఉంది. దీంతో హైవేలపై సాఫీగా ట్రాఫిక్ మరింత సులభతరం కానుంది.