Health

చిన్నారి పేరిట క్యాన్సర్‌కు కొత్త మందు

చిన్నారి పేరిట క్యాన్సర్‌కు కొత్త మందు

క్యాన్సర్‌ (Cancer)కు అమెరికా పరిశోధకులు ఒక కొత్త మందును రూపొందించారు. దీనికి ఏవోహెచ్‌1996 (AOH1996)అని నామకరణం చేశారు. ఇది ఒక చిన్నారి పేరు. చివరి అంకెలు ఆమె పుట్టిన సంవత్సరానికి గుర్తుగా పెట్టినట్లు అమెరికా శాస్ర్తవేత్తలు తెలిపారు.అమెరికా (America)లో ఏడాదికి 600 మంది చిన్నారులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వారిని ఎంతో ప్రభావితం చేస్తోన్న న్యూరోబ్లాస్టోమా (Neuroblastoma)ను నివారించేందుకు ఈ మందు కనుగొన్నారు. అన్నా ఒలివియా హీలీ అనే చిన్నారి 1996లో ఇండియానాలో జన్మించింది. బాలికకు న్యూరోబ్లాస్టోమా వచ్చింది. క్యాన్సర్‌తో ఎంతో పోరాడి తన తొమ్మిదో ఏట ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి దిగ్భ్రాంతి చెందిన పరిశోధకులు ఇలాంటి పరిస్థితి మరే చిన్నారికి రాకూడదనే ఉద్దేశంతో ఈ మందును తయారు చేశారు. అయితే, దీనిని రూపొందించేందుకు రెండు దశాబ్దాలకు ముందే పరిశోధనలు మొదలు పెట్టిన్నట్లు వెల్లడించారు.

AOH1996 అన్ని రకాల క్యాన్సర్‌ కణతులను నిర్మూలిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్‌ హోప్‌ హాస్పిటల్‌లో ఈ ఔషధానికి మొదటి ఫేజ్‌ క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాన్సర్‌ ఎక్కువగా నాడీకణాల్లో ప్రారంభమౌతుంది. తరచుగా పిండంపై ప్రభావం చూపుతుంది. డీఎన్‌ఏలోని పీసీఎన్‌ఏ (PCNA)క్యాన్సర్‌ కణతులు వృద్ధి చెందేందుకు సహకరిస్తుంది. ఈ ఔషధం PCNAను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. అంటే జన్యుపదార్థం (DNA)లోని ఆరోగ్యకరమైన కణాలపై ప్రభావం చూపదు.ఇది కణ తంతువులోని క్యాన్సర్‌ కణాలు నశించేలా పనిచేయడంతో రొమ్ము, మెదడు, అండాశయం, చర్మ, ఊపిరితిత్తులకు సోకే రకరకాల క్యాన్సర్లను నివారించడంలో కూడా ఉపయోగపడవచ్చని శాస్ర్తవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘‘హీలీ క్యాన్సర్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె చివరి క్షణాల్లో నేను తన తండ్రిని కలిశాను. అప్పుడు ఆయన క్యాన్సర్‌ నివారణకు మందును కనిపెట్టేందుకు కొంత డబ్బును పరిశోధనల కోసం ఇచ్చారు.  ఆ చిన్నారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాము. అందుకే ఆ ఔషధానికి ఆమె పేరును పెట్టాం’’అని  ప్రొఫెసర్ లిండా మల్కాస్ వెల్లడించారు.