పిల్లలకు చెవి కుట్టించడం సంప్రదాయం. పెద్దలు కుట్టించుకోవడం ఫ్యాషన్. దేనికైనా రెండే మార్గాలు.. తరాలనాటి పద్ధతి, ఆధునికమైన గన్‌షాట్. దేని ప్రత్యేకతలు దానివే. దేని పరిమితులు దానివే. గన్‌షాట్ పద్ధతిలో నొప్పి ఉండదు కాబట్టి, చాలామంది అటువైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా, పసిపిల్లలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ చాలా సందర్భాల్లో ముక్కు, చెవులు కుట్టేవారు కనీస పరిశుభ్రత కూడా పాటించడం లేదనేది వైద్యుల ఫిర్యాదు. కుట్టేముందు సూదిని, గన్‌ను స్టెరిలైజ్ చేయాలి. చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. కుట్టించుకున్నవారు కూడా చెవి, ముక్కు భాగాలను అపరిశుభ్రమైన చేతులతో ముట్టుకోరాదు.
ముఖ్యంగా చెవి కుట్టిన తర్వాత.. ఆ వైపుగా తలపెట్టి పడుకోకూడదు. దీనివల్ల దిండులో పోగైన బ్యాక్టీరియా చెవిపై దాడి చేస్తుంది. చెవి మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. వాపు, గాయం ఎక్కువగా ఉన్నప్పుడు పసుపు పూసుకుంటే సరిపోతుందనో, ఆకు పసరుతో మానిపోతుందనో అనుకోకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఓ వయసు వచ్చాక.. కొందరిని మధుమేహం లాంటి సమస్యలు బాధించవచ్చు. దీనివల్ల గాయాలు మానడం కష్టం. అలాంటివారు కుట్టాల్సిన అవసరం లేకుండానే చెవులకు, ముక్కుకు అలంకరించుకునే నగలను ఎంచుకోవడం ఉత్తమం.