ScienceAndTech

త్వరలో రానున్న గూగుల్ సరికొత్త ఫీచర్

త్వరలో రానున్న గూగుల్ సరికొత్త ఫీచర్

రోజురోజుకి టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అంతర్జాలం మరింత వేగం పుంజుకుంటోంది. ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అదే రీతిలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాతో లెక్కలేనన్ని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త టెక్నాలజీలు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నట్లు, అలాంటి వాటికి నిర్మూలించి, వినియోగదారులను అప్రమత్తం చేయడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ ఇప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది మిగిలిన అన్ని దేశాల్లో విస్తరించనుంది.

నివేదికల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ ‘రిజల్ట్ అబౌట్ యూ’ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ అనతి కాలంలోనే మొబైల్, వెబ్‌సైట్ వంటి వాటిలో ప్రత్యక్షమైంది. ఆ ఫీచర్ ఇప్పుడు మరింత ఆధునికంగా మారింది. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత వాటిని తొలగించడానికి కూడా వీలుంటుంది.ఇప్పటి వరకు వినియోగదారులకు సంబంధించిన వివరాలను వెతుక్కోడానికి చాలా సమయం పట్టేది. కానీ త్వరలో రానున్న గూగుల్ కొత్త ఫీచర్ యూజర్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించిన వెంటనే ఇస్తూ.. తొలగించుకోవడానికి సహకరిస్తుంది.గూగుల్ కొత్త ఫీచర్ వల్ల వ్యక్తిగత వివరాలు సులభంగా తొలగించవచ్చు, కానీ అవసరమైన చోట కూడా ఈ వివరాలు తొలగిపోతాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వినియోగదారుడు తప్పకుండా కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల అలాంటి సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.