అన్ని భందాలలో కన్నా గొప్ప భందం స్నేహం అంటారు. స్కూల్ వయసు వచ్చినప్పటి నుంచి చివరికి మన చావు వరకు ఉండే భందమే స్నేహం. యుక్త వయసులో ఉన్న యువకులు అన్ని తమ తమ కుటుంబంతో పంచుకోలేరు. కాలేజ్ లో పరిచయం అయినా స్నేహితులతో తమ బాధలను, సంతోషాలను పంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే కుటుంబం కంటే ఎక్కువ సమయం స్నేహితులతో పంచుకుంటారు. దానినే స్నేహం లో ఉన్న గొప్పతనమని చెప్పొచ్చు.స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఆటపాటలాడుకునే చిన్నారుల దగ్గరినుంచి పండు వృద్దాప్యంలో ఉన్న అందరిలోనూ స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తున్న మనమందరం చాల అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టిలో నా అన్నవారు, బంధువులు లేని వారెవరైనా ఉంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో ఉన్న ఆత్మీయులతో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను స్నేహితుల వద్ద చెప్పుకుని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం గొప్పతనం.
స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని ఇస్తుంది. “జీవనయానంలో స్నేహం శ్వాస వంటింది”, “స్నేహం అమ్మ ప్రేమకన్నా తియ్యనైనది”, “స్నేహితులతో కలిసి ఉంటే ఆనందం వర్ణించలేనిది”.. ఇలా ఎన్ని రకాలుగా వర్ణించినా స్నేహం గొప్పతనం ముందు దిగదుడుపే. అందుకే ఈ పవిత్ర బంధానికి చిహ్నంగా ఈరోజుని అంటే ప్రతి ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డే గా జరుపుకుంటున్నాము. అందుకే అమ్మ నాన్నలను, కుటుంబ సభ్యులను దేవుడు ఇస్తే, స్నేహితులను మాత్రం మనమే వెతుకోవచ్చు.