Sports

ఆర్చరీలో 42 ఏళ్ల తరువాత భారత్ ను వరించిన స్వర్ణం

ఆర్చరీలో  42 ఏళ్ల భారత్ను వరించిన స్వర్ణం

వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత నిరీక్షణ ముగిసింది. 42 ఏళ్ల కలను సాకారం చేస్తూ తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతీ సురేఖ టీమ్ స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. కాంపౌండ్‌ మహిళల జట్టు విభాగంలో విజయవాడకు చెందిన జ్యోతీ సురేఖ, అదితి, పర్ణీత్‌ త్రయం అసాధారణ ప్రదర్శనతో బంగారు పతకాన్ని ముద్దాడింది.

వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఏ విభాగంలోనైనా భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. శుక్రవారం కాంపౌండ్‌ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్‌ భారత జట్టు 235-229 తేడాతో టాప్‌ సీడ్‌ మెక్సికోను ఓడించింది. టోర్నీ ఆసాంతం తమకంటే బలమైన జట్లను ఓడిస్తూ దూసుకెళ్లిన అమ్మాయిలు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించారు.

ప్రత్యర్థి పటిష్టంగా ఉన్నా.. గాలి తీవ్రత అధికంగా ఉన్నా.. ఏ దశలోనూ ఆధిక్యం చేజారకుండా విజయాన్ని అందుకున్నారు. తొలి రౌండ్‌ నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ త్రయం.. 60కి గాను 59 స్కోరు చేసి తుది పోరును ఘనంగా ప్రారంభించింది.

క్వింటెరో, హెర్నాండెజ్‌, బెసెరాతో కూడిన మెక్సికో జట్టు తొలి రౌండ్లో 57 పాయింట్లు మాత్రమే రాబట్టింది. రెండు, మూడు రౌండ్లలోనూ 59 చొప్పున పాయింట్లు రాబట్టిన భారత త్రయం.. చివరి రౌండ్‌కు ముందు 177-172తో ఆధిక్యంలో నిలిచింది. చివరి రౌండ్‌ ఆఖరి సెట్‌కు ముందు కూడా భారత్‌ 207-199తో విజయం దిశగా సాగింది.

చివరి సెట్‌లో మొదట మెక్సికో ఆర్చర్లు ముగ్గురు పదేసి చొప్పున పాయింట్లు సాధించారు. దీంతో ఆ జట్టు స్కోరు 237కు చేరింది. ఆ దశలో మొదట పర్ణీత్‌ 10 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత అదితి 9 పాయింట్లు గెలిచింది. దీంతో మరో అయిదు పాయింట్లు గెలిస్తే భారత్‌దే స్వర్ణం అనే పరిస్థితుల్లో విల్లు ఎక్కుబెట్టిన సురేఖ.. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ 9 పాయింట్లు సాధించింది.

దీంతో భారత్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో జ్యోతి ఇప్పటి వరకు 7 పతకాలు సాధించింది. మరే భారత ఆర్చర్‌ కూడా ఇన్ని పతకాలు సాధించలేదు. వ్యక్తిగత, మిక్స్‌డ్‌, మహిళల జట్టు విభాగాల్లో కలిపి ఆమె ఓ స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు నెగ్గింది.ఇక మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగం క్వార్టర్స్‌లో శనివారం సహచర ఆర్చర్‌ పర్ణీత్‌తోనే జ్యోతి పోటీపడనుంది. మరో క్వార్టర్స్‌లో డి లాత్‌ (నెదర్లాండ్స్‌)తో అదితి తలపడనుంది.