2004 నవంబరు నెల అనంతపురం జిల్లాలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదానికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు.కేసు వివరాల్లోకి వెళ్తే.. నవంబరు 2004లో అనంతపురం జిల్లాకు చెందిన శివశంకర్, శివకేశవులు ఓ బైక్‌పై, సాకే ముత్యాలు, దాసరి బోడప్ప(వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి) మరొక బైక్‌పై అనంతపురం బయలుదేరారు. ముందు వెళుతున్న బైక్‌ను సాకే ముత్యాలు ఢీకొట్టడంతో నలుగురూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాసరి బోడప్ప మృతిచెందారు. పరిహారం కోసం మృతుడి కుటుంబసభ్యులు బీమా కంపెనీకి దరఖాస్తు చేయగా.. అందుకు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నిరాకరించింది. దీంతో మోటారు ప్రమాద బీమా క్లైమ్‌ల ట్రైబ్యునల్/ అనంతపురం ఐదో అదనపు జిల్లా కోర్టును బాధితులు ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు చెప్పిన ట్రైబ్యునల్.. రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని 2008లో ఆదేశించింది. ఈ తీర్పును అదే ఏడాది హైకోర్టులో యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ సవాల్ చేసింది. అదనపు ప్రీమియం చెల్లించలేదని, వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి బీమా వర్తించదని ఆ సంస్థ తరఫు లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ వెంకటరమణ.. సదరు సంస్థ వాదనలను తోసిపుచ్చారు. ద్విచక్ర వాహనానికి ‘ప్యాకేజీ పాలసీ’ తీసుకొని ఉంటే వెనుక సీటులో ఉన్నవారికీ ప్రమాద బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీమా పరిహారం కేసుల్లో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు. బీమా సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను ఆయన తిరస్కరించారు. అంతేకాదు, పరిహారాన్ని కూడా రూ.2 లక్షల నుంచి రూ.9.18 లక్షలకు పెంచిన న్యాయమూర్తి.. ఆ సొమ్మును వాహన యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా చెల్లించాలని జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆదేశాలు జారీచేశారు.
బైకు వెనుక కూర్చున్న వ్యక్తికి బీమా వర్తిస్తుంది: AP HC
Related tags :