జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఇలా త్రికాలాలనూ త్రికరణ శుద్ధిగా, వివరణాత్మకంగా విశ్లేషించే వేదిక టీ దుకాణం. సమయ నియమాల్లేకుండా ఎప్పుడూ ఓ పదిమంది చర్చించుకునే మినీ పార్లమెంట్ ఇది! వేడివేడి టీని ఆస్వాదిస్తూ, వాడివేడిగా అభిప్రాయాలు కుండబద్దలు కొట్టే సిసలైన వక్తలు ఇక్కడ కోకొల్లలు కనిపిస్తారు. అదును చూసి పదునైన మాటలతో తన వాదనను నెగ్గించుకోవడానికి వీళ్లకు ఒక్క స్ట్రాంగ్ టీ చాలు! ఉష్ణోదకం జిహ్వను తాకి, గొంతు జారగానే.. మిస్తిష్కంలో ఆలోచనలు మిసైల్ వేగంతో పురుడుపోసుకుంటాయి. మాటలు కోటలు దాటేస్తాయి. చేతులు ఊగిపోతాయి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి శర పరంపరలా.. విరామం లేకుండా వాగ్బాణాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయి.
ఒక్కోసారి అసహనంతో యోధులు యుద్ధ నియమాలు భగ్నం చేసినట్టు.. వాదులాటలో నెగ్గలేక ఆవేశం కట్టలు తెగి చేతిలో ఉన్న గాజు గిలాసను గిరాటు కొట్టడమూ రివాజే! వీరికింత ఉల్లాసమూ, ఉత్సాహమూ, విషయ పరిజ్ఞానమూ ఎలా వచ్చాయని అచ్చెరువొందాల్సిన అవసరం లేదు. ఈ మినీ పార్లమెంట్.. మినీ లైబ్రరీ కూడా! అక్షర జ్ఞానం లేని టీ కొట్టు యజమాని సైతం నాలుగైదు దినపత్రికలను తెప్పించడం సంప్రదాయం. అక్కడికి వచ్చిన తేనీటి ప్రియులు గంటల తరబడి ఆ పత్రికలు చదువుతుంటారు. మధ్యలో మరో టీ ఆర్డరిచ్చి మరీ పత్రికా పఠనం కొనసాగిస్తుంటారు. ఇలా లోక విశేషాలన్నీ కరతలామలకం చేసుకుంటారు. ఈ క్రమంలో ఏదో విషయంలో చర్చ మొదలవ్వడం, దానిపై వాదోపవాదాలు గంటల తరబడి కొనసాగడం సర్వ సాధారణం! వీరిని కదిలిస్తే.. రాబోయే ప్రభుత్వం ఎవరిది? ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఎంత బలముంది? ఎవరు గెలుస్తారు? ఎందుకు ఓడిపోతారు? ఇలా సెఫాలజిస్ట్‌ల కన్నా కచ్చితమైన సమాచారం అందిస్తారు. ఇన్ని తెలివితేటలకు కారణం ఏకాక్షరి సేవననే! అందుకే కాబోలు పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీ విరామం తప్పనిసరి చేసింది!
కశ్మీరీ టీ
కావలసినవి:టీ పొడి: మూడు టీ స్పూన్లు,చల్లటి నీళ్లు: మూడు కప్పులు,మంచు ముక్కలు ఉన్న నీళ్లు: మూడు కప్పులు, పాలు: రెండు కప్పులు, చక్కెర: రెండు టీ స్పూన్లు, దాల్చిన చెక్క: ఒక అంగుళం, యాలకులు: రెండు, లవంగాలు:మూడు, పిస్తా-బాదం (తరుగు): పావు కప్పు
తయారీ: గిన్నెలో చల్లటి నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, టీ పొడి వేసి నీళ్లు ఒక కప్పు అయ్యేవరకు సన్నని మంటపై మరగనివ్వాలి. అందులో చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. డికాక్షన్ గులాబి రంగులోకి రావడానికి వీటిని వేస్తారు. ఇప్పుడు ఐస్ ముక్కలున్న నీటిని పోసి నీటి మట్టం రెండు కప్పులు అయ్యేంత వరకు బాగా మరిగించాలి. డికాక్షన్ ముదురు గులాబి రంగులోకి మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కప్పులోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు కప్పుల పాలు పోసి, అందులోకి పిస్తా, బాదం తరుగు వేసి ఒక కప్పు అయ్యేంత వరకు మరగనివ్వాలి. పాలలో పావు కప్పు డికాక్షన్ పోసి ఒక పొంగు వచ్చాక గ్లాస్‌లోకి పోసుకోవాలి. గులాబీరంగులో గుబాళించే కశ్మీరీ టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
మనోహరమైన భావాలకు, మధురమైన సాహిత్యానికి తేనీటి విందు వేదిక!