Politics

జగన్‌ను వీరప్పన్‌తో పోల్చిన పవన్

జగన్‌ను వీరప్పన్‌తో పోల్చిన పవన్

వీరప్పన్‌ అమాయకులైన గిరిజనులతో గంధపు చెట్లను కొట్టించినట్లే… జగన్‌ వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ప్రజల డేటా కొట్టేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ప్రతి కంపెనీని వాటాలు అడుగుతున్నారని.. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ దోచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో భూదందాలు బయటకు తీసి దోషులను అందరి ముందు నిలబెడతామని హెచ్చరించారు. వైకాపా నేతల అరాచకాలను కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకుందని.. జగన్‌కు మద్దతిస్తున్న, సహజ వనరులను దోచుకుంటున్న అందరి చిట్టా వారి దగ్గరుందని చెప్పారు. త్వరలో అవన్నీ బయటకు వస్తాయన్నారు. జగన్‌.. కేంద్రంతో నిన్ను ఒక ఆట ఆడించకపోతే అడుగు అంటూ హెచ్చరించారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం విశాఖపట్నంలోని జగదాంబ కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇరవై ఏళ్ల క్రితం ‘సుస్వాగతం’ సినిమా చిత్రీకరణ సమయంలో జగదాంబ కూడలిలో బస్సు మీద ఎక్కి డ్యాన్స్‌ చేశానని, ఇప్పుడు ‘వారాహి’పై ఎక్కి ప్రజల కోసం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. విశాఖ నుంచి ఏం మాట్లాడతానోనని చాలా కోపంగా, గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైకాపా నాయకులకు హృదయపూర్వక నమస్కారాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ఉదయం ఓ పథకం కింద డబ్బులిచ్చి, సాయంత్రం సారా కింద పట్టుకుపోతున్నారని విమర్శించారు.