విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పార్శిళ్లు పంపించడం మరింత సులభతరం కానుంది. మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచే ఫారిన్‌కు పార్శిళ్లు పంపించవచ్చు. ఇందుకోసం దేశంలో భారీగా పోస్టాఫీసులకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ అనుమతించింది.పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ, వాటిని అతి తక్కువ పోస్టాఫీసులకే పరిమితం చేశారు. దీంతో విదేశాలకు పార్శిళ్లు పంపించాలంటే దూరంగా ఉన్న పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. లేదా అధిక రుసుము చెల్లించి ప్రైవేట్ కొరియర్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది.ఈ సమస్యను గుర్తించి పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను దేశవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎక్సైజ్–కస్టమ్స్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 715 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులను అనుమతించింది. త్వరలోనే కొత్తగా అనుమతించిన పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఏపీలో 4 నుంచి 24కు పెంపు…తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 55 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులకు అనుమతించారు. వాటిలో హెడ్ పోస్టాఫీసులు(హెచ్‌వో), సబ్ పోస్టాఫీసులు(ఎస్వో) కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నాలుగు పోస్టాఫీసుల నుంచే విదేశాలకు పార్శిల్ సర్వీసులు అందిస్తున్నారు. కొత్తగా 24 పోస్టాఫీసుల నుంచి ఈ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం ఒక్క పోస్టాఫీసు నుంచే విదేశాలకు పార్శిల్ చేసేందుకు అవకాశం ఉంది. తాజాగా 31 పోస్టాఫీసులకు అనుమతించారు.
ఏపీలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు….శ్రీకాకుళం హెచ్‌వో, విజయనగరం హెచ్‌వో, పార్వతీపురం హెచ్‌వో, అనకాపల్లి హెచ్‌వో, పాడేరు హెచ్‌వో, అమలాపురం హెచ్‌వో, కాకినాడ హెచ్‌వో, సామర్లకోట హెచ్‌వో, రాజమహేంద్రవరం హెచ్‌వో, తాడేపల్లిగూడెం హెచ్‌వో, మచిలీపట్నం హెచ్‌వో, విజయవాడ పాలిటెక్నిక్ ఎస్వో, గుంటూరు హెచ్‌వో, నరసరావుపేట హెచ్‌వో, బాపట్ల హెచ్‌వో, ఒంగోలు హెచ్‌వో, చిత్తూరు హెచ్‌వో, రాయచోటి హెచ్‌వో, కడప హెచ్‌వో, కర్నూలు హెచ్‌వో, నంద్యాల హెచ్‌వో, అనంతపురం హెచ్‌వో, ప్రశాంతినిలయం ఎస్వో, విజయవాడ బకింగ్‌హామ్‌పేట ఎస్వో.
తెలంగాణలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు…హైదరాబాద్ జీపీవో, భూపాలపల్లి ఎస్వో, జగిత్యాల హెచ్‌వో, జేఎన్టీయూ కూకట్పల్లి ఎస్వో, కొత్తగూడెం కోల్స్ హెచ్‌వో, మహబూబాబాద్ హెచ్‌వో, మహబూబ్‌నగర్ హెచ్‌వో, నిర్మల్ ఎల్ఎస్జీ ఎస్వో, వనస్థలిపురం ఎస్వో, వికారాబాద్ హెచ్‌వో, మంచిర్యాల హెచ్‌వో, మెదక్ హెచ్‌వో, ములుగు బి–క్లాస్ ఎస్వో, నాగర్‌కర్నూల్ ఎస్వో, నల్లగొండ హెచ్‌వో, నారాయణపేట ఎస్వో, భువనగిరి హెచ్‌వో, హన్మకొండ హెచ్‌వో, జనగాం హెచ్‌వో, కామారెడ్డి హెచ్‌వో, ఖమ్మం హెచ్‌వో, సిరిసిల్ల ఎస్వో, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్వో, సూర్యాపేట హెచ్‌వో, లక్ష్మీపూర్ ఎస్వో, వనపర్తి హెచ్‌వో, గద్వాల్ హెచ్‌వో, నిజామాబాద్ హెచ్‌వో, పెద్దపల్లి హెచ్‌వో, ఆర్సీ పురం హెచ్ఈ ఎస్వో, షాద్‌నగర్ ఎస్వో.