మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన డ్రోగ్ పారాచూట్లపై ఇస్రో నిర్వహించిన వరుస పరీక్షలు విజయవంతమయ్యాయి. యాత్ర ముగించుకొని తిరిగి భూమికి చేరే సమయంలో వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి, దాన్ని స్థిరంగా ఉంచడానికి ఇవి సాయపడతాయి. చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్‌టీఆర్‌ఎస్)లో ఈ నెల 8-10 తేదీల్లో ఈ పరీక్షలు జరిగినట్లు ఇస్రో శుక్రవారం పేర్కొంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ) తోడ్పాటుతో వీటిని నిర్వహించినట్లు వివరించింది. ఈ పారాచూట్లను వ్యోమనౌకలోని మోర్టార్లు అనే సాధనాల్లో ప్యాక్ చేసి ఉంచుతారు. ఆదేశం ఇవ్వగానే విచ్చుకునేలా వాటిని తీర్చిదిద్దారు. ఈ పారాచూట్ల వెడల్పు 5.8 మీటర్లు. వ్యోమనౌకను సాఫీగా, నియంత్రిత పద్ధతిలో భూమికి తెచ్చేలా వాటిని రూపొందించారు. అలాగే ఆకస్మికంగా విచ్చుకున్నప్పుడు ఉత్పన్నమయ్యే కుదుపు కూడా తక్కువగా ఉండేలా చూశారు. ఆర్‌టీఆర్‌ఎస్ కేంద్రంలో పారాచూట్లను మూడుసార్లు పరీక్షించారు. తద్వారా వీటి విశ్వసనీయత, పనితీరును విశ్లేషించారు.