WorldWonders

మాజీ ప్రియుడిని అపహరించి పెళ్లి చేసుకున్న ప్రియురాలు

మాజీ ప్రియుడిని అపహరించి పెళ్లి చేసుకున్న ప్రియురాలు

పెళ్లైన ప్రియుడిని అపహరించి అతనితో బలవంతంగా తాళి కట్టించుకుంది ఓ మాజీ ప్రియురాలు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో సదరు యువతిని, ఆమెకు సహకరించిన ముగ్గురు బంధువులనూ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై వేళచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు పార్తిబన్‌, రాణిపేటకు చెందిన సౌందర్య కళాశాలలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. గత నెల 5న పార్తిబన్‌ ఐటీ ఉద్యోగం చేసే యువతిని పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సౌందర్య.. పార్తిబన్‌ను మర్చిపోలేనని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. దీంతో ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్‌, శివకుమార్‌ల సాయంతో యువకుడి కిడ్నాప్‌నకు ప్రణాళిక వేశారు. శుక్రవారం ఎప్పటిలాగానే కార్యాలయానికి బయలుదేరిన పార్తిబన్‌ని కారులో వచ్చి అపహరించారు. నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. కిడ్నాప్‌ విషయంపై యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులే అపహరించారని వారిని అదుపులోకి తీసుకున్నారు.