భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఇండియా విజన్ 2047’ డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల్లో ఐదుగురు జ్యూయిష్‌లు ఉన్నారని గుర్తు చేశారు. తెలుగు జాతి కూడా అంత గొప్పస్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాబోయే వందేళ్ల సమయం నేటి చిన్నారులు, విద్యార్థులదేనని.. దేశాభివృద్ధిలో తెలుగుజాతి ప్రముఖ పాత్ర పోషించాలన్నారు.
‘‘భవిష్యత్తు ప్రణాళిక లేకుంటే వ్యక్తిత్వ వికాసం కష్టం. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు విజన్ ఉండాలి. విజన్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్తారు. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటాం. ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచించాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవాలి. మన ఆర్థిక విధానాల వల్ల 1991 వరకు దేశాభివృద్ధి పెద్దగా లేదు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల శక్తిమంతంగా మారాం. 90ల్లో వచ్చిన ఇంటర్‌నెట్ రివల్యూషన్ వల్ల ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 21వ సెంచరీ మనదే.. అనుమానం లేదు’’ అని చంద్రబాబు అన్నారు.
దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖ…‘‘రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖ. నాకు నచ్చినది.. నన్ను ఎప్పుడూ అభిమానించేది.. విశాఖ నగరం. కులమతాలు, ప్రాంతీయ భావాలకు అతీతంగా అభివృద్ధి కోరుకునే నగరం విశాఖ. దేశంలో ఎక్కడైనా రిటైర్ కావాలన్నా.. ఎక్కడ మంచి సిటీ ఉందని ఆలోచించినా.. ఆ జాబితాలో విశాఖ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది మనందరికీ గర్వకారణం. మా దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌లో ఎక్కువ తలసరి ఆదాయం వస్తోంది. విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2029కి పిలుపునిచ్చాం.
విజయవాడ-గుంటూరు మధ్య అమరావతి నగరం తలపెట్టాం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలని అనుకున్నాం. మా హయాంలో ఐదేళ్లలో 10ప్లస్ గ్రోత్ రేట్ సాధించాం. విశాఖ ప్రజలు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ డ్రాఫ్ట్ మాత్రమే. దీనిపై మేధావులు చర్చించాలి. ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచించాలి. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలి. కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలి. సెల్‌ఫోన్ తిండి పెడుతుందా అని నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌తో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెరుగుతున్న యువతే దేశాభివృద్ధికి చాలా కీలకంగా మారుతారు. పేదరికం లేని సమాజం తేవాలి. 2047లోగా సంక్షేమం, అభివృద్ధి, సాధికారత రావాలి. పేదరికం లేని సమాజం కోసమే పీ-4 మోడల్ ప్రకటించా’’ అని చంద్రాబాబు అన్నారు.