తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న భాజపా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు కాషాయ దళం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 17న మొదలు పెట్టి అక్టోబరు 2న ముగించే విధంగా ప్లాన్ చేస్తో్ంది. ఉమ్మడి పది జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఒక్కో క్లస్టర్‌కు ఒక కీలక నేత నేతృత్వం వహించేలా సన్నాహాలు చేస్తోంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటడంతో భారాసకు ప్రత్యామ్నాయం భాజపాననే వాదన బలంగా వెళ్లింది. ఆ తర్వాత భాజపాలోకి చేరికలు కూడా భారీగా పెరిగాయి. కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా భాజపాలో జోష్ తగ్గింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్ర చేపట్టాలని భాజపా భావిస్తోంది.